భారత్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం సహా కొవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు సలహాలు ఇచ్చే విధంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
గతేడాది 7.5 లక్షల మంది భారతీయులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారని... దీనివల్ల విదేశీ మారకం సహా ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా భారత్ నుంచి బయటకు వెళ్తున్నట్లు రమేశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులందరూ ఇక్కడే చదువుకునేలా అన్ని ప్రయత్నాలు చేయాలని అన్నారు.
"ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితి కారణంగా విదేశాలలో చదువుకోవాలనుకున్న చాలా మంది విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. వీరిలో చాలా మంది భారతదేశంలోనే చదువుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. చదువు పూర్తవుతుందో లేదో అనే భయంతో దేశానికి తిరిగివచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ రెండు వర్గాల విద్యార్థుల అవసరాలను తీర్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. భారతదేశంలోని ప్రధాన సంస్థలలో తగిన అవకాశాలను కల్పించి వీరు ఇక్కడే చదువుకునే సదుపాయాలు ఏర్పాటు చేయాలి. విదేశాల నుంచి తిరిగి వచ్చే విద్యార్థుల ఆందోళనలను సైతం పరిష్కరించాల్సిన అవసరం ఉంది."
-రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి