కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా.. పాఠశాలలు, కళాశాలలకు మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది కేంద్రం. విద్యాలయాలు తిరిగి ప్రారంభం కాగానే.. నూతన సీటింగ్ అరేంజ్మెంట్, షిఫ్ట్‌ల వారీగా తరగతులు, మెస్, లైబ్రరీకి సంబంధించి సరికొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమవడానికి ముందుగానే ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
పాఠశాలలకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, కళాశాలలకు యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్ కమిషన్(యూజీసీ)లు వేర్వేరుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాయి. కొత్తగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చేరే వారికి సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండు తరగతికి చెందిన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది సీబీఎస్ఈ. షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.