పట్టా కోసం ఓ రైతు పట్టపగలు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రభుత్వ కార్యాలయంలో ఓ తహసీల్దార్‌పై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన యావత్ భారతం ఉలిక్కిపడేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నేటికీ ఈ ఘటన తాలూకు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. దుర్ఘటన తరవాత తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని, తమకు భద్రత కావాలని రెవిన్యూ ఉద్యోగులు రోడ్డెక్కారు. మూడు రోజుల పాటు విధులకూ దూరంగా ఉన్నారు. భూపరిపాలననే తమ శాఖ పరిధి నుంచి తప్పించాలంటున్నారు. మరోవైపు ఏళ్ల తరబడి తమ భూ సమస్యలు పరిష్కారంకాక ఇబ్బందులు పడుతున్న రైతాంగం, ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. పట్టాలు రాక, రెవిన్యూ రికార్డుల్లోకి వివరాలు ఎక్కక తీవ్రంగా నష్టపోతున్నవారు, చెప్పులరిగేలా రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా పని జరగనివారు, దీర్ఘకాలంగా భూ సమస్యలతో సతమతమవుతున్నవారు ఆవేదనతో, ఆవేశంతో ప్రతిస్పందిస్తున్నారు. రెవిన్యూ కార్యాలయాల్లో డబ్బులిస్తే కానీ ఏ పనీ జరగదన్నది సాధారణ ప్రజల అభిప్రాయం. దశాబ్దాలుగా ప్రభుత్వాలు భూపరిపాలనను చక్కదిద్దకపోవడమే ఈ సమస్యకు మూలమన్న బలమైన వాదనను వినిపిస్తున్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా చంపడమే, చావడమో సమస్యలకు పరిష్కారం కాదు. భూసమస్యలకు మూలాలు శోధించాలి, శాశ్వత పరిష్కారాలు వెతకాలి. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు.
మూలమేమిటి?
కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని తెచ్చిన ఒత్తిడే తహసీల్దార్ హత్యకు కారణంగా తెలుస్తుంది. ఈ సమస్య కొంచెం లోతుకెళ్తే ఎన్నో భూ హక్కుల చిక్కులు ఉన్నాయి. వివాదంలో ఉన్న భూమికి పాత రికార్డుల్లో ఒకరు పట్టాదారుగా నమోదై ఉన్నారు. ఇదే భూమిపై తరవాతి కాలంలో మరో వ్యక్తి కౌలుదారుగా నమోదయ్యారు. వీరిద్దరూ కాక మరి కొంతమంది ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. పట్టాదారు, కౌలుదారు, ఇప్పుడు సాగులో ఉన్నవారి నుంచి కొందరు ఈ భూమిని కొనుగోలు చేశారు. వీరందరి దగ్గర భూమికి సంబంధించి కొన్ని కాగితాలు ఉన్నాయి. కౌలుదారుడికి అనుకూలంగా రెవిన్యూ డివిజనల్ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ తీర్పులిచ్చారు. ఇప్పుడీ భూమికి ప్రభుత్వం ఇటీవల జారీచేసిన కొత్త పట్టా పాసుపుస్తకం కావాలని సాగులో ఉన్న వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుల్లో కేసు నడుస్తుంది కాబట్టి పట్టా ఇవ్వలేమన్నది రెవిన్యూవారి వాదన. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ హత్య ఘటన చోటుచేసుకుంది. సాగులో ఉన్నవారికి పట్టాలు లేకపోవడం, వారికి పట్టాలు ఇవ్వలేని పరిస్థితులు దుర్ఘటనకు దారితీశాయి. కానీ, దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు పరిష్కారం కాలేదన్నదే కీలక ప్రశ్న. 1950లో వచ్చిన కౌలుచట్టం కింద దఖలుపడ్డ హక్కుల్లో ఇంకా ఎందుకు స్పష్టత లేదు. ఒకే భూమిపై ఇన్ని రకాల హక్కులు, చిక్కులు ఎందుకున్నాయి. ఒకవేళ పట్టా ఇవ్వలేకపోతే ఇవ్వలేమని తహశీల్ కార్యాలయం ఎందుకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వలేదు... ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ
ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుతూపోతే కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదురవుతాయి. మూలాలేమిటో అర్థమవుతాయి.
అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఏ భూమి రికార్డూ భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ రికార్డును ఎప్పుడైనా సవరించవచ్చు. ఈ రికార్డుల్లోని వివరాలకు భరోసా లేదు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. హద్దు రాళ్లు ఉండవు. వాస్తవ పరిస్థితికి రికార్డులు అద్దంపట్టవు. ఏ సమస్యకు ఎవరి దగ్గరకు ఎలా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరించాలనే విషయాలపై స్పష్టతా ఉండదు. లెక్కకు మిక్కిలి భూచట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు... వెరసి అంతా గందరగోళం. నలభై ఏళ్లకు ఒకసారి నిర్వహించాల్సిన భూముల సర్వే ఎనభై ఏళ్లయినా దిక్కులేదు. మిగిలిన సీలింగ్, టెనెన్సీ, ఇనాం లాంటి కీలక భూ చట్టాల అమలు అసంపూర్ణం. భూ పరిపాలనకు రెవిన్యూ శాఖ తగిన సమయం ఇవ్వలేదు.
చట్టాలు, నియమాలపై శిక్షణ కరవు. పేదలకు అండగా ఉన్న పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ అటకెక్కింది. న్యాయ సేవా సంస్థలనుంచి సాయమూ మృగ్యం. జమాబందీ, అజమాయిషీ ఆగిపోయింది. రెవిన్యూ కోర్టుల్లో ఉన్న కేసుల సమీక్ష జరగడం లేదు. సివిల్ కోర్టుల్లో మూడొంతుల వ్యాజ్యాలు భూ తగాదాలకు సంబంధించినవే. ఇక భూపరిపాలన వ్యవస్థలోని కొందరు వ్యక్తుల చట్టవిరుద్ధ పనులు, యంత్రాంగంపై పలు రకాల ఒత్తిళ్ళు... మరెన్నో కారణాలు భూ హక్కుల చిక్కులు కొలిక్కి రాకుండా చేస్తున్నాయి. అన్నింటికీ పరిష్కారం వెతకాలంటే సమగ్ర అధ్యయనం అవసరం.
ప్రభుత్వం కదలాలి..
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా కావాల్సింది- సంకల్పం, సమష్టి కృషి. రైతుల తిప్పలు తప్పాలంటే తక్షణ చర్యలు కొన్ని అవసరం. మరికొన్ని దీర్ఘకాలిక ప్రణాళికల అమలూ తప్పనిసరి. రెవిన్యూ యంత్రాంగంలోనూ మార్పు రావాలి. స్పందించే తీరు మారాలి. ప్రజలూ అవగాహన పెంచుకోవాలి. తమ భూ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి దరఖాస్తుకు ఒక రసీదు ఇచ్చి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం చూపాలి. పరిష్కారం కానిదైతే వివరాలను రాతపూర్వకంగా తెలియపరచాలి. భూమికి సంబంధించి 76 రకాల సమస్యలు ఉన్నాయి. వాటికి దరఖాస్తు విధానం, ఎవరిని సంప్రతించాలి, పరిష్కార సమయం వంటి వివరాలను తెలిపే పట్టిక ప్రతి రెవిన్యూ కార్యాలయంలో పెట్టాలి.