రహదారి భద్రతావారోత్సవాల్ని క్రమం తప్పక నిష్ఠగా నిర్వహించే భారతావని- ప్రపంచానికే రోడ్డు ప్రమాదాల రాజధానిగా దుష్కీర్తిని వరసగా ఈ ఏడాదీ పదిలపరచుకొంది. ప్రపంచవ్యాప్తంగా నిరుడు 13 లక్షల 50 వేల మందికి పైగా అభాగ్యులు రహదార్ల రక్తదాహానికి బలైపోగా, అందులో 11శాతం- అంటే, లక్షన్నరకుపైగా మరణాలు ఇండియా పద్దులోనే జమపడ్డాయి.
మరణాల్లో 2.4శాతం పెరుగుదల....
2017తో పోలిస్తే ప్రమాదాల సంఖ్యలో అరశాతం వృద్ధి నమోదుకాగా, మరణాల్లో 2.4శాతం పెరుగుదల బెంబేలెత్తిస్తోంది. ప్రమాదాలపరంగా తమిళనాడు (13.7శాతం), మధ్య ప్రదేశ్ (11శాతం), ఉత్తర్ ప్రదేశ్ (9.1శాతం) వరసగా తొలి మూడు స్థానాలూ ఆక్రమించగా- ప్రాణ నష్టంలో ఉత్తర్ ప్రదేశ్ (22,256), మహారాష్ట్ర (13,261), తమిళనాడు (12,216) అగ్రస్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 7,556 మంది, తెలంగాణలో 6,603మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాయుష్కులయ్యారంటున్న గణాంకాల్ని బట్టి- ఉభయ తెలుగు రాష్ట్రాల కన్నీటి వ్యధ మహారాష్ట్రను మించి దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది!
97558 మంది....
అతి వేగం ప్రాణాంతకమని ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకు పోరుతున్నా లక్ష్యపెట్టని దుందుడుకుతనమే 64.4శాతం అంటే 97,558 మంది మరణాలకు కారణమని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు మార్గంలో వాహనాల్ని ఉరికించడం ప్రమాద హేతువుల్లో రెండో స్థానం ఆక్రమిస్తోంది. దాన్ని కట్టడి చెయ్యగలిగితే 8764 మంది అభాగ్యుల ప్రాణాలు నిలిచేవి! మోటారు వాహన సవరణ చట్టాన్ని అమలు చేయబోమన్న రాష్ట్రాల్లో, అపరాధ రుసుముల్ని తగ్గించిన చోట్లా ప్రమాద మరణాలు అత్యధికంగా ఉన్నాయని ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ మొత్తుకొంటోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఇండియా బహుముఖ వైఫల్యం ఏటా లక్షల కుటుంబాల్లో కన్నీటి కాష్ఠాల్ని రాజేస్తూ సామాజిక మహా సంక్షోభాన్నే సృష్టిస్తోంది!
2020 నాటికి 50 లక్షల ప్రాణాలు...
రహదారి భద్రత కార్యాచరణ దశాబ్దిగా 2011-’20ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానించి 2020నాటికి 50 లక్షల నిండు ప్రాణాల్ని కాపాడే అవకాశాన్ని ప్రస్తావించింది. ఆ మహా సంకల్పాన్ని తాను సైతం ఔదలదాల్చిన భారత్, క్షేత్రస్థాయి ఫలితాల్ని రాబట్టడంలో కిందుమీదులవుతూ దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోతోంది. ఇండియాలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 17 మరణాలు- రాదారి భద్రత ఛిద్రమైందనడానికి తిరుగులేని రుజువులు.
చైనా కంటే ఇండియాలోనే ఎక్కువ....
2005లో రహదారి ప్రమాద మృతుల సంఖ్య ఇండియాలో 95వేలకు చేరువైనప్పుడు, జన చైనాలో దాదాపు 99వేల మరణాలు నమోదయ్యాయి. దరిమిలా ఇండియా ఏటికేడు రోడ్డు ప్రమాదాలు, మృతుల్లో ఆందోళనకర పెరుగుదలను కళ్లకు కడుతుంటే- మరణాల సంఖ్యను చైనా గణనీయంగా నియంత్రిస్తూ వస్తోంది. నిరుడు చైనాలో రహదార్ల రక్తదాహానికి బలైనవారు 63వేల మంది! లిప్తపాటులో ప్రమాదాలకు, దాన్ని వెన్నంటి విషాదభరిత మరణాలకూ అతివేగమే పుణ్యం కట్టుకొంటున్నందున- దాని కట్టడి మీదే చైనా ప్రధానంగా దృష్టి సారించింది.