కరోనా ప్రభావం కారణంగా పిల్లలు, పెద్దలు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సమయంలో పెద్దలు ఇంట్లోని పనుల్లో తీరికలేకుండా ఉంటారు. అయితే, ఎప్పుడూ స్నేహితులతో సరదాగా ఆడుకునే పిల్లలు మాత్రం బడికి దూరమై, మిత్రులతో కలిసి ఆడుకోలేక ఎటూ పాలుపోని స్థితిలో ఉంటున్నారు.
ఇంట్లోనే ఉండటం, తినటం, టీవీ చూడటం, నిద్రపోవడం.. ఇలా రోజలు గడిచిపోతున్నాయి. పిల్లలంటేనే అల్లరి, ఆటాపాటా. వాటికి దూరంగా ఉంచితే, వారి మనసు నొచ్చుకోవడమే కాక వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులే స్నేహితులుగా మారి పిల్లలు మానసిక ఆందోళన చెందకుండా చూసే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఏం చేయాలంటే..?
తల్లిదండ్రులు వారి పిల్లలతో సరదాగా గడపాలి. వారి భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. వారిలో ధైర్యం నింపాలి. వారు చెప్పే మాటల్ని ఆసక్తిగా విని వారి భాషలోనే పలకరించే ప్రయత్నం చేయడం మంచిది.
ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లల్లో తెలియని భయం ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నామనే ఆవేదనకు గురవుతుంటారు. అందుకే వీలైనంత సేపు వారితో గడిపండి. పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా కథలు చెప్పండి. వారితో చెప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడు చిన్నారుల్లో వారిపట్ల మీకు ఎంత ప్రేమ ఉందో వారు తెలుసుకొంటారు.
వారి భాషలోనే..
పిల్లలతో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. పిల్లలతో మాట్లాడాలంటే ముందుగా వారి భాషపై అవగాహన, పట్టు పెంచుకోవాలి. అనంతరం ఏం చెప్పాలనకున్నా వారు ఉపయోగించే పదబంధంతో, వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు.
కరోనాపై ప్రపంచం ఏవిధంగా పోరాడుతోందో వారి భాషలోనే అర్థమయ్యేలా వివరించాలి. ముఖ్యంగా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో నేర్పాలి. తరచూ చేతుల్ని శానిటైజర్లు, సబ్బుతో శుభ్రం చేసుకొనేలా చూడాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలి. పిల్లల ప్రవర్తన, తినే విధానం, అలవాట్లలో ఏవైనా మార్పు, అనుమానాలు వస్తే వెంటనే కుటుంబ వైద్యులు లేదా పిల్లల మానసిక నిపుణుల్ని సంప్రదించండి. వీలైతే వారి క్లాస్ టీచర్‌తోనూ మాట్లాడించే ప్రయత్నం చేయాలి.
ఆటలతో..
లాక్‌డౌన్ కారణంగా బయటకు వెల్లే వీలులేనందున పిల్లలు ఇంట్లోనే ఆడుకునేలా చూడండి. ఇంట్లోనే క్యారమ్స్, చదరంగం ఆటల్ని ఆడించండి. సుడోకు, పజిల్స్ పరిష్కరించడం వంటి చేయించడం ద్వారా పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది. వీలైతే తీరిక సమయాల్లో వారితో కలిసి ఆడుతూ, వారికి మిత్రులు లేని లోటును తీర్చండి.