దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. జీ-7 దేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే ఈ తేడా మనకు అర్థమవుతుంది. భారత్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు దాని రేటు తక్కువగానే ఉంది.
మార్చిలో జరిగిన దిల్లీలోని తబ్లిగ్ ఎ జమాత్ మత కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక సంక్రమణను నివారించటం మన ముందున్న సవాలు. వారందరినీ గుర్తించి.. వారి నుంచి ఎవరికి సంక్రమించిందో పూర్తి స్థాయిలో మదింపు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రభావాన్ని అంచనా వేస్తూ దానికి తగిన వ్యూహాలను అనుసరించాలి.
మోదీ ఆధ్వర్యంలో..
కరోనాపై పోరులో కార్యాచరణ ప్రణాళిక, అమలును ప్రధాని నరేంద్రమోదీ మొదటి నుంచి పర్యవేక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ప్రపంచంతోపాటు దేశ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఫిబ్రవరి ప్రారంభం నుంచి అంతా ప్రధాని మోదీ తన చేతుల్లోకి తీసుకున్నారు. వుహాన్, ఇరాన్, ఇటలీలోని భారతీయులను దేశానికి తీసుకువచ్చారు. భారత్‌లో కరోనా ముప్పును తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సామాజిక వ్యాప్తిని నియంత్రించేందుకు క్రమంగా వైమానిక, రైలు మార్గాలను మూసివేశారు. చివరకు లాక్ డౌన్ అమలు చేశారు.
అంతర్జాతీయంగానూ..
చైనాలో మొదలైన ఈ సంక్షోభం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దీర్ఘకాల దృష్టితో దేశానికి ఉపశమన చర్యలకు వ్యూహాత్మకంగా ఉపక్రమించారు. సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌కు నేతృత్వం వహించారు. జీ-20 దేశాల వీసీలోనూ పాల్గొన్నారు.
బృందాల నియామకం..
దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా మార్చి 22న జనతా కర్ఫ్యూను ప్రకటించారు మోదీ. ఆ రోజు పరిస్థితులను పరిశీలించి పూర్తి లాక్ డౌన్ కు నిర్ణయించారు.
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు 11 సాధికార బృందాలను నియమించారు మోదీ. అన్ని సందర్భాల్లో తన ప్రధాన బృందగణానికి రెండు విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అందులో మొదటి... భారత్‌లో ఉన్న అధిక జనాభా. రెండోది చైనాకు అతి సమీపంలో ఉండటం.