నిర్భయ ఘటన..దేశంలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార కేసు. 2012లో జరిగిన ఈ నేరానికి దోషులకు మరణశిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది దిల్లీ కోర్టు. వారిని తిహార్ జైలులో ఉరి తీయాలని ఇటీవల డెత్‌వారెంట్ జారీ చేసింది.
అయితే న్యాయపరమైన అన్ని దారులను ఉపయోగించి మరణశిక్షను ఆలస్యం చేసేందుకు నలుగురు దోషులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22న అమలు చేయాల్సిన మరణశిక్ష ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో మరో దోషి పిటిషన్ విచారణలో ఉంది.
మరోవైపు ఫిబ్రవరి 1న మరణ శిక్ష అమలు చేసేందుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరి తీసేందుకు మేరఠ్‌కు చెందిన తలారి పవన్ జల్లాడ్‌ను ఎంపిక చేశారు. తిహార్ జైలులో ఇప్పటికే పలుమార్లు ట్రయల్స్‌ను పూర్తి చేశారు.
న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతే శనివారం నిర్భయ దోషుల ఉరి తథ్యమే.
పవనే ఎందుకు..?
నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవన్ జల్లాడ్ సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్‌కు ఉరి తీసిన అనుభవం ఉంది. శారీరకంగా బలిష్ఠంగా ఉన్నాడు. అతని పూర్వీకులు కూడా తలారిలే కావటం వల్ల ఎలాంటి తప్పిదాలు జరగవన్న భావనతో అధికారులు పవన్‌వైపు మొగ్గుచూపారు. ఈ మేరకు తిహార్ అధికారులు అర్జీ పెట్టుకోగా ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖ అంగీకరించింది.
పారితోషికం ఎంత..?
ఉరివేస్తే తలారిలకు ప్రభుత్వం ఎంత పారితోషికం ఇస్తుందనే సందేహం సాధారణంగా ప్రతిఒక్కరిలో ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒకరికి ఉరి వేస్తే రూ.25 వేలు చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే నిర్భయ దోషులకు నలుగురికి మరణ శిక్ష అమలు చేస్తే పవన్‌కు లక్ష రూపాయలు పారితోషికంగా లభిస్తుంది.
పవన్‌కు అంగీకారమేనా?
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం రావాలని పవన్ జల్లాడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తలారిగా ఎంపికైన వెంటనే ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.