భారీగా ఓట్లు కొల్లగొట్టి అధికార పీఠం దక్కించుకునేందుకు.. అన్ని అస్త్రాలకు పదును పెడుతున్నాయి బిహారీ పార్టీలు. సోషల్ ఇంజినీరింగ్‌లో ఆరితేరిన నేతలు ప్రజాకర్షక హామీలతో ముందుకొస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా ఓటు బ్యాంకును సుస్థిర పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులం కార్డు.. గెలుపు తీరాలకు చేర్చుతుందని భావించే ఈ ఎన్నికలలో కొన్ని అగ్రవర్ణాలు కీలకం కానున్నాయి.
సామాజిక వర్గం మద్దతు బిహార్‌లో ఎప్పుడూ చోదక శక్తిలా పని చేస్తుంటుంది. ముఖ్యంగా అగ్రవర్ణాలు ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావమే చూపుతాయి. ఈ లెక్కల్లో ప్రధానంగా బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, భూమిహర్లు సహా అగ్రవర్ణాల్లోని ఉపకులాలతో కలుపుకుని దాదాపు 15% ఓట్లు ఉంటాయి.
సంప్రదాయ మద్దతు కమలానికే..
సంప్రదాయంగా వీరి మద్దతు భాజపా, ఆ పార్టీ మిత్రపక్షాలకే ఉంటుంది. ప్రతి పార్టీకి ప్రత్యేకంగా కొన్ని కులాల మద్దతు ఉన్న పరిస్థితుల్లోనూ.. అగ్రకులాలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటాయి పార్టీలు. ఈ నేపథ్యంలో పార్టీ ఏదైనా.. అగ్రవర్ణాలకు ప్రత్యేక కోటా ఉంటుంది. అందుకు అనుగుణంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంటుంది. అగ్రకులాల నేతలను చేర్చుకునేందుకు పార్టీలు సైతం పోటీ పడుతుంటాయి. అయితే, భాజపా ఎప్పటికప్పుడు వీరి సమస్యలపై పోరాటం చేస్తూ.. మద్దతు కూడగట్టుకుంది.
బిహార్‌లో ఉన్న 243 అసెంబ్లీ స్థానాల్లో 40 నియోజకవర్గాలు రిజర్వ్డ్ కేటగిరిలో ఉన్నాయి. 38 స్థానాలు ఎస్సీలకు కేటాయించగా, 2 స్థానాలు ఎస్టీలకు అట్టిపెట్టారు. ప్రస్తుతం శాసనసభలో 53 మంది చట్టసభ్యులు అగ్రకులాలకు చెందినవారే ఉన్నారు.
ఈ అగ్రవర్ణాలు భాజపాకు మద్దతు ఇవ్వటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల్ కమిషన్ ద్వారా 90వ దశకంలో జనతా పార్టీ వెనుకబడిన వర్గాలు, ఓబీసీల వెంట నిలిచింది. అదే అదునుగా భాజపా అగ్రవర్ణాలను అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత క్రమంగా వారి మద్దతు పెంచుకుంటూ వస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్న వీరంతా.. హస్తం పార్టీ లాలూకు మద్దతు తెలపటం వల్ల దూరమవుతూ వచ్చారు.
ఇదీ చూడండి:బిహార్ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?
అగ్రవర్ణాలను ఆదరించని లాలూ
ఇక లాలూ గద్దెనెక్కిన తర్వాత.. వీరికి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. లాలూ పరోక్షంగా.. భుమిహర్, రాజ్‌పుత్, బ్రాహ్మణులతోపాటు లాలా కులాలను దూరం పెడుతూ వచ్చారు. దీంతో ఆర్జేడీ మిత్ర పక్షాలకు పూర్తిగా దూరమయ్యాయి ఈ వర్గాలు.
అనంతరం, దళిత వర్గానికి చెందిన మావోయిస్టులు- భూమిహర్ వర్గానికి చెందిన రణ్వీర్ సేన మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 1999 మార్చిలో జహానాబాద్‌లోని సెనారి గ్రామంలో 34 మంది భూమిహర్లను పొట్టనబెట్టుకుంది మావోయిస్టు దళం. ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కనీసం ఈ ప్రాంతానికి పరామర్శించటానికి రాకపోవటం మరింత వ్యతిరేకత మూటగట్టుకునేలా చేసింది.
జేడీయూకూ కష్టమే !