ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన మహారాష్ట్రలోని ధారావిలో కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. 'మిషన్ ధారావి' ప్రణాళికతో భారీ సవాలును జయించింది బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ).
- ఇరుకే సవాలు...
దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో అద్దాల మేడలు.. దీపకాంతుల వన్నెలు ఓ వైపుంటే... వాటి వెనకాలే సూర్యకాంతి కూడా ప్రవేశించలేని ఇరుకైన 'ధారావి' మురికివాడ ఉంది. ధారావి ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా. పొట్టచేతబట్టుకుని పని కోసం నగరానికి వచ్చే వలస కూలీలు.. దాదాపు ఇక్కడే తలదాచుకుంటారు. గాలి కూడా సరిగ్గా రాని ఒకే గదిలో ఓ కుటుంబమంతా గడపాలి. స్నానాలు, కాలకృత్యాలకు వందల కుటుంబాలకు కలిపి ప్రజా మరుగుదొడ్లుంటాయి. ఇంత కిక్కిరిసిన వాడలో 2 మీటర్ల భౌతిక దూరం పాటించి, కరోనా సోకకుండా చూడడం పెద్ద సవాలే.
- వైద్యుల సహకారంతో.. కరోనా పోరులో 'మిషన్ ధారావి' విజయం!
ప్రైవేటు వైద్యుల భాగస్వామ్యంతో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో బీఎంసీకీలకపాత్ర పోషించింది. తొలుత కరోనా లక్షణాలు కనిపించినా.. ఆసుపత్రికి వెళ్లేవారు కాదు అక్కడి ప్రజలు. ఆసుపత్రికి వెళితే, తమ చుట్టుపక్కల వారు కరోనా సోకినందుకు తమ కుటుంబాన్ని వెలివేస్తారనే భయమే ఇందుకు కారణం. అందుకే, ఏళ్లుగా ఆ ధారావి వాడల్లోకి వెళ్లి వైద్యం చేస్తున్న ప్రైవేటు వైద్యుల సహకారంతో తొలుత ఆ భయాన్ని పోగొట్టింది బీఎంసీ.
ప్రైవేటు ప్రాక్టీషనర్లనూ క్షేత్రస్థాయిలో మోహరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. వారికి పీపీఈ కిట్లు, థర్మల్ స్కానర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, మాస్కులు, చేతి తొడుగులు సమకూర్చి.. ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అనే ‘4టీ’ విధానానికి శ్రీకారం చుట్టింది.
ధారావిలో గత 35ఏళ్లుగా సేవలందిస్తున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధికారి, డాక్టర్ అనిల్ పచ్నేకర్... కరోనా కట్టడిలో తమ బృందం ఎలా పనిచేసిందో ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
"ఇక్కడ కరోనా విజృంభణ మొదలయినప్పుడు.. ధారావిలో నా ఆసుపత్రి మాత్రమే తెరిచి ఉంది. మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ శివాజీ నాతో మాట్లాడి డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. ఆపై మొదటి దశలో మా బృందం ఇంటింటికి వెళ్లి వారం రోజుల్లో దాదాపు 50 వేలమంది నుంచి నమూనాలు స్వీకరించింది. వారిలో 20 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండో దశలో కరోనా సోకినవారి చుట్టుపక్కల వారిని క్వారంటైన్ చేశాం. ఉచితంగా వైద్య సేవలందించాం. ఇక మూడో దశలో ఇంటింటికి వెళ్లి కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశాం. దీంతో కేసులు చాలా వరకు తగ్గాయి."
-డాక్టర్ అనీల్ పచ్నేకర్
- లాక్డౌన్ సడలింపులతో ఊరట..