ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా.. పురుషులు, వృద్ధులనే లక్ష్యంగా చేసుకుందా? ప్రస్తుతం నమోదైన కేసులను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈ మహమ్మారి బారిన పడిన వారిలో అధికంగా వృద్ధులు, పురుషులే ఉన్నారు. వీరిలోనూ శ్వాసకోశ, గుండె, ఆస్తమా, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు దీని బారిన పడుతున్నారు.
వృద్ధులు అధికం
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం వృద్ధులకు కష్టంగా మారింది. 50 ఏళ్లకు పైబడిన వారికి పలు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల ఈ వైరస్ సోకుతుంటే కోలుకోవడానికి వారి రోగనిరోధక శక్తి సరిపోవడం లేదు.
దేశంలో తొలి కరోనా మృతి కేసు అయిన కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తికి అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం ఉండగా వైరస్ సోకింది. ఇవి ఉండగా కరోనా రావడం వల్ల ఆయన చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కూడా ఇలాంటి లక్షణాలతోనే మరణించింది. ఈమెకు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన తన కొడుకు ద్వారా వైరస్ సోకింది. బిహార్‌కు చెందిన ఓ కిడ్నీ బాధితుడికి ఈ వైరస్ సోకగా అతడూ మరణించాడు.
మహారాష్ట్రలో నలుగురు వారే
మహారాష్ట్రలో వారంలోనే నలుగురు వృద్ధులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు 63 ఏళ్ల వారు కాగా, మిగిలినవారికి 60, 72 సంవత్సరాలు. వీరందరికీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి.
కోల్‌కతాలో...
కోల్‌కతాలో ఓ 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా అతడు గుండెపోటుతో మృతి చెందాడు. టిబెట్ నుంచి వచ్చిన 69 ఏళ్ల వ్యక్తి కరోనాకు బలయ్యాడు. కరోనా సోకిన తర్వాత మరణించిన బంగాల్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి కూడా పలు వ్యాధులు ఉన్నాయి. వీరంతా పురుషులే కావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.