కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా విజృంభిస్తోంది. అయితే.. ఇది మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో మీకు తెలుసా.. ఇది చదవండి
1. ఇలా ప్రవేశం...
మన నోరు, ముక్కు, కళ్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఏసీఈ2 అనే ప్రొటీన్‌ను ఉత్పత్తిచేసే శ్వాసనాళ కణాలకు ఇది అతుక్కుంటుంది. గబ్బిలాల్లోనూ ఇలాంటి ప్రొటీన్‌కే ఇది అతుక్కుని ఉంటుంది.
2. వైరల్ ఆర్‌ఎన్‌ఏ విడుదల
వైరస్ చుట్టూ ఉన్న జిగురులాంటి పొర సాయంతో కణజాలానికి అతుక్కుంటుంది. లోపలికి ప్రవేశించాక రైబో న్యూక్లిక్ యాసిడ్(ఆర్‌ఎన్‌ఏ)ను విడుదల చేస్తుంది.
3. కణాల హైజాక్
వైరస్ ఆర్‌ఎన్‌ఏ మనిషి కణజాలపు పనితీరును పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటుంది.
4. వైరస్‌ల తయారీ
ఇన్‌ఫెక్షన్ ముదురుతున్న కొద్దీ.. కణ వ్యవస్థ కొత్త మొనల్ని(స్పైక్స్) పొడుచుకొచ్చేలా చేస్తుంది. దీనివల్ల వైరస్‌ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
5. కొత్తవన్నీ ఒకచోట చేరి..
కొత్తగా తయారైన వైరస్‌లు ఒకచోట పోగై.. కణం బాహ్య వలయంపైకి చేరిపోతాయి.
6. వ్యాప్తి ఇలా...
వ్యాధిగ్రస్తమైన ప్రతి కణం విచ్ఛిన్నమై చనిపోయేలోపే.. కోట్లకొద్దీ వైరస్‌లను విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన వైరస్‌లు సమీపంలోని కణాల్లోకి చేరిపోవచ్చు. లేదా తుంపర్లుగా మారి.. దగ్గినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా బయటికి వెలువడవచ్చు.
7. రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కొవిడ్-19 సోకిన వారికి ఎక్కువగా జ్వరం వస్తుంది. ఎందుకంటే మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ దానితో పోరాడుతూ ఉంటుంది. తీవ్రమైన కేసుల్లో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి.. ఊపిరితిత్తుల కణాలపైనా దాడిచేయొచ్చు. కఫం, చనిపోయిన కణాలతో ఉపిరితిత్తుల మార్గం మూసుకుపోవచ్చు. అప్పుడు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని కేసుల్లో తీవ్ర శ్వాసకోశ సమస్యకు దారితీసి.... మరణం సంభవించొచ్చు.