17 శాతం మంది ఎత్తుకు తగిన బరువు లేరు... 35 శాతం మందిలో ఎదుగుదల లోపం... 33 శాతం మంది బరువు తక్కువ.... భారత్‌లో పౌష్టికాహార లోపంపై తాజా సర్వేల(ఎన్‌ఎఫ్‌హెచ్-4, సీఎన్‌ఎన్‌ఎస్)లో వెల్లడైన వాస్తవాలివి. ఇదే సమయంలో అధిక బరువు కేసులూ పెరుగుతున్నాయన్న గణాంకాలు గుబులు పుట్టిస్తున్నాయి.
బ్రెజిల్ ఫార్ములా...
భారతదేశ 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషకాహార లోపానికి, బ్రెజిల్‌కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఒకప్పుడు బ్రెజిల్దీ ఇదే సమస్య. అయితే నాలుగు దశాబ్దాల వ్యవధిలో బ్రెజిల్ ఎదుగుదల లోపాలను 55శాతం నుంచి 6శాతానికి తగ్గించింది.
ఇదంతా బ్రెజిల్ ఎలా సాధించింది? ముందుగా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలకు గల కారణాలను సమగ్రంగా విశ్లేషించుకుంది. తగినంత ఆహారం లభించకపోవడం, మహిళలు, పిల్లలపై సరైన జాగ్రత్తలు వహించకపోవడం, వైద్య సదుపాయాల కొరత, అనారోగ్యకరమైన వాతావరణం వంటి పలు కారణాలను గుర్తించింది.
ఇవన్నీ ప్రమాదానికి సంకేతాలా?
కచ్చితంగా ఇవి ప్రమాదానికి సంకేతాలే. భారతదేశం సైతం ఈ అంశాలపై ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం ఇతర దేశాలు సాధించిన ఫలితాలు, వారు అవలంబించిన విధానాలు మన దేశ పరిస్థితులకు నప్పకపోవచ్చు. ఇతర దేశాల విధానాలు అచ్చుగుద్దినట్లు మన దేశంలో అమలు చేస్తే నిరుత్సాహకర ఫలితాలు ఎదురుకావచ్చు. కానీ సందర్భోచితంగా తీసుకునే నిర్ణయాలు ఉపయోగకరంగా ఉంటాయన్నది మాత్రం వాస్తవం.
ఎఫెక్ట్
అన్నిరకాల పౌష్టికాహార లోపాలను అంతమొందించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న "కుపోషన్ ముక్త్ భారత్-2022" పథకానికి మరింత ఊతమివ్వడం, పథకానికి ప్రజలను మరింత చేరువ చేయడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. వివిధ రకాల పౌష్టికాహార లోపాలను తగ్గించడానికి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయత్నాలను మరింత వేగిరం చేయడానికి ఎఫెక్ట్(E-F-F-E-C-T )ను ప్రతిపాదిస్తున్నాను.
->E-ఎవిడెన్స్:
అధిక నాణ్యత కలిగిన, కఠినమైన సమాచార ఉత్పత్తి సాధనాలు, రియల్ టైమ్ చర్యల కోసం సాంకేతికత, పద్ధతులపై దృష్టి సారించాలి. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సరైన దిశలో ముందుకు వెళ్తున్నాయో లేదో సమీక్షించుకోవడానికి సమర్థమైన పర్యవేక్షణ, మూల్యాంకన విధానాలు కూడా అవసరం.
->F-ఫుడ్ సిస్టమ్స్:
ఆరోగ్యకరమైన ప్రజల జీవితానికి దీనితో విడదీయలేని సంబంధం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆహార వ్యవస్థ అనారోగ్యకరమై ఆహారం తీసుకునే విధంగా ఉంది. ఇంట్లో వండుకునే తాజా ఆహారం, స్థానికంగా లభించే ధాన్యాలకు బదులుగా అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం అధికమవుతోంది. సూక్ష్మపోషకాహార లోపాన్ని అరికట్టేందుకు బలవర్థకమైన ధాన్యాలను ఆహారంలో తీసుకోవాలని జాతీయ పోషకాహార కార్యక్రమాలు నొక్కి చెబుతున్నాయి. కానీ యువతకు స్వదేశీ ఆహారాన్ని పరిచయం చేయడంలో చాలా దూరంగా ఉన్నాయి.
->F-ఫైనాన్సెస్:
డబ్బు లేకుండా ఏదీ జరగదు! ప్రజల ఆరోగ్యం, పోషణ వంటి అంశాలపై దృష్టిసారించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రజలు తమ ఆహార పదార్థాలను సరిగ్గా ఎంపిక చేసుకునే విధంగా ఆర్థికపరమైన చర్యలు చేపట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. వెనకబడినవారికి అనుకూలమైన ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం, లింగ-ఆదాయ అసమానతలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.
ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ, ఆదాయ పంపిణీ, వైద్యం, పోషకాహార సేవలను అందుబాటులో ఉంచగలిగితే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినట్లే. అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం కారణంగా లబ్ధిదారులపై జరుగుతున్న అక్రమాలను గుర్తించి సరిచేయాలి.
->E-ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్‌ఫీడింగ్ అండ్ ఐవైసీఎఫ్ ప్రాక్టీసెస్:
పౌష్టికాహార లోపాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేయాలన్న విషయంపై చాలా చర్చించాం. కానీ ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగత బాధ్యతలు కూడా ఈ విషయంలో అంతే ముఖ్యం. నవజాత శిశువులను పెంచే విధానం పరిగణించదగినది. పర్యావరణ కారకాలు(కుటుంబం, సామాజిక-ఆర్థిక స్థితి, సౌలభ్యం, పని విధానాలు) ఈ విషయంలో ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. కానీ ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాలను చూస్తే... 7శాతం మంది పిల్లలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఇది విస్మరించలేం.
పోషకాహార లోపం అనేది ముందుగానే బయటపడదు. అందుకే పిల్లలను సరిగ్గా పోషించడం లేదన్న విషయం సంరక్షకులు తెలుసుకోలేకపోతున్నారు. మన సమాజంలో తల్లిపాలివ్వడం ముందుగానే ఆపేస్తారు. పరిపూర్ణమైన పోషకాహారం అందించడం మాత్రం ఆలస్యంగా ప్రారంభిస్తారు. అంటువ్యాధులను నివారించడానికి పరిశుభ్రమైన భోజన తయారీ, శుభ్రమైన పరిసరాలు, సకాలంలో రోగ నిరోధకత పాటించడం చాలా ముఖ్యం. మొదటి 1000 రోజుల్లో(శిశు జననం తర్వాత) సంభవించే నష్టాన్ని(ముఖ్యంగా పెరుగుదల, మెదడు అభివృద్ధి విషయంలో) పెద్ద ఎత్తున తగ్గించలేమని మనకు తెలుసు.
శీఘ్ర దృష్టి కోణంతో స్వల్పకాలిక పరిష్కారాలు కనుగొనడం మరో సమస్య. తృణ ధాన్యాలను జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా ఇవ్వడం, కార్బొహైడ్రేట్ అధికంగా ఉండే భోజనం(రేషన్, మధ్యహ్న భోజనం, అంగన్వాడీ) అందించడం ద్వారా పిల్లల్ని తీవ్రమైన పోషకాహార లోపం బారి నుంచి బయటపడేలా చెయ్యొచ్చు. కానీ వీటి ద్వారా చిన్నారులను అసంక్రమణ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాం.
ఒక రకమైన పోషకాహార లోపం నుంచి మరొక పోషకాహార లోపం బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలి. పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలను వినియోగించడం ద్వారా పలు రాష్ట్రాల్లో కొంత మెరుగుదల కనిపిస్తోంది. అయితే ఇది మరింత పెరగాలి.
->C-కన్వర్జెన్స్, కెపాసిటీ బిల్డింగ్:
పోషణపై అధిక ప్రభావం చూపే తాగునీరు, పారిశుద్ధ్యం, ఉద్యోగ కల్పన, విద్య, ప్రకటనలు, రోగ నిరోధకత, వ్యవసాయం, పర్యావరణం వంటి అంశాలపై పరిపూర్ణ చర్యలు చేపట్టాలి. పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వీటిపై శ్రద్ధ కనబర్చడం చాలా ముఖ్యం. వివిధ రంగాల్లో చేపట్టే చర్యలను సమగ్రపర్చడానికి పోషకాహారం ఓ అనుసంధానంలా పనిచేస్తుంది. ఉమ్మడి యాజమాన్యం, జవాబుదారీతనం, సున్నితమైన చర్యల కోసం సమయానుసారమైన ప్రణాళిక, ప్రోత్సాహకాలు అందించడం చాలా సహాయపడతాయి.
సామర్థ్యం లోపాలను పరిష్కరించడం, ఖాళీలను భర్తీ చేయడం, నియామక జాప్యాలను నివారించడం, సకాలంలో పదోన్నతులు, పనితీరును మెరుగుపరచడానికి స్వల్పకాలిక శిక్షణలు వంటివి పోషకాహార లోపంపై పోరాడటానికి తొలి అడుగు.
->T-టెక్నాలజీ టు ట్రాన్స్‌ఫార్మ్ ఎవిడెన్స్ టు యాక్షన్ ఫర్ ఇంప్రూవుడ్ న్యూట్రిషన్
పోషకాహారం వంటి రంగాల్లో మరింత ప్రగతి సాధించడానికి అటు ప్రభుత్వాలు, ప్రజలపై సాంకేతికత ప్రభావం అధికంగా ఉంటుంది. ఓవైపు సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ప్రజలకు ఉపకరిస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా చైతన్యం కలిగించడంలో సాంకేతికత తోడ్పడుతుంది. ప్రవర్తన మార్పులపై అధిక ప్రభావం చూపే నాణ్యమైన సాంకేతికతను మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టడం ఆవశ్యకం. సమాజంలో కలిసి జీవించడానికి, నిరంతర అభ్యాసం కోసం మన జ్ఞానాన్ని చర్యలుగా మార్చడమే నూతన ఆవిష్కరణల లక్ష్యం కావాలి.
ఫలితాలు తథ్యం!
ఈ చర్యలన్నీ సరైన దిశలో చేపట్టగలిగితే ముందుముందు వీటి వాస్తవ ప్రభావం, ఫలితాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. అన్ని వయస్కుల వారికి విస్తృతమైన, విభిన్నమైన పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే మెరుగైన ప్రయత్నాలు, శక్తి సామర్థ్యాలే అన్ని రకాల పోషకాహార లోపాలపై చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. వినూత్న ఆవిష్కరణల ద్వారా కచ్చితమైన పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుంది.
(రచయిత-శ్వేత ఖండేల్వాల్, న్యూట్రీషన్ రీసెర్చ్ హెడ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌లో ఆచార్యులు)