దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన హాథ్రస్ ఘటనపై అనూహ్య ప్రకటన చేశారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. బాధితురాలి గొంతు నులమడం వల్ల మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా స్పష్టమైందని తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నివేదికలో పేర్కొనలేదని యూపీ శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్‌కుమార్ వెల్లడించారు.
"గొంతు నులమడం వల్ల, తీవ్ర వేదనకు గురికావడం వల్ల ఆమె చనిపోయినట్లు దిల్లీ నుంచి వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. తర్వాత ఫోరెన్సిక్ నివేదిక కూడా మాకు అందింది. వారు సేకరించిన నమూనాలో స్పెర్మ్ లేదా శుక్ర కణాలు లేవని స్పష్టమైంది.
దీనిని బట్టి కొందరు ఉత్తర్‌ప్రదేశ్‌లో కులం పేరిట అలజడి సృష్టించేందుకే.. ఈ చర్యలకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి వేగవంతమైన, నిర్దిష్ట సమయంలో విచారణ జరిపారు. విచారణ కొనసాగించి., తప్పుడు ప్రచారం చేసినవారిని గుర్తిస్తాం."
- ప్రశాంత్‌కుమార్, ఏడీజీ, యూపీ శాంతిభద్రతల విభాగం
వివరణ కోరిన మహిళా కమిషన్..
బాధితురాలి మృతదేహానికి అత్యవసరంగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని జాతీయ మహిళా కమిషన్.. పోలీసులను ప్రశ్నించింది. కుటుంబ సభ్యులు లేకుండానే అర్ధరాత్రి 2.30 గంటలకు దహన సంస్కారాలు నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
కుటుంబ సభ్యుల కోరికే మేరకే యువతి అంత్యక్రియలు నిర్వహించామని స్థానిక పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకున్న కారణంగా కాలినడకన హాథ్రస్ వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు.