చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ జాడ గుర్తించినప్పటికీ... సమాచార వ్యవస్థను పునురిద్ధరించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సమయం మించిపోతోందని, ఈ ప్రక్రియ అంత సులభం కాదన్నారు. అయితే తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసినట్లు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ అంతకుముందు తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్... జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.
రోవర్ ప్రజ్ఞాన్.. ల్యాండర్లోనే ఉన్నట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరాల్లో నిక్షిప్తమైందన్నారు శివన్. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ బలంగా దిగి ఉంటే.. ఏమైనా హాని కలిగి ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం.. ఇంకా ఆ వివరాలు తెలియలేదని బదులిచ్చారు.
చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్‌లో భాగంగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండర్ విక్రమ్ నుంచి ఇస్రో కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో యావత్ భారతావని నిరాశ చెందిన సమయంలో ల్యాండర్ ఆచూకీ లభించడం ఊరట కలిగించింది.
చంద్రయాన్-2: 'విక్రమ్' ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్