దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల వెంట యావత్ భారతావని ఉందనే సందేశాన్ని ఈ పార్లమెంటు సమావేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా పాయింట్లో మాట్లాడారు ప్రధాని మోదీ. వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో అనేక కీలకాంశాలు, బిల్లులపై సమగ్ర చర్చ జరుగుతుందని.. ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఈ సమావేశాల్లో పార్లమెంటుకు మరో గురుతర బాధ్యత ఉంది. మన వీర సైనికులు సరిహద్దుల్లో, ఎంతో ఎత్తైన పర్వతాలపై దేశ రక్షణ కోసం నిలబడి ఉన్నారు. కొద్ది రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మాతృభూమి కోసం వారు దృఢ సంకల్పంతో పోరాడుతున్నారు. వారికి... పార్లమెంటు, పార్లమెంటు సభ్యులంతా ముక్తకంఠంతో, ఒకే భావన, ఒకే సంకల్పంతో సైనికుల వెంట ఈ దేశం ఉందని చాటిచెబుతారని విశ్వసిస్తున్నా. "