కరోనాపై పోరులో అవిశ్రాంతంగా శ్రమిస్తోంది అమిత్ షా సారథ్యంలోని కేంద్ర హోమంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ). మిగతా శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు నిన్నటివరకు ఇళ్లనుంచే విధులు నిర్వర్తించి ఈరోజే కార్యాలయాలకు హాజరయ్యారు. హోంశాఖ మాత్రం మార్చి 24 నుంచి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా విరామం లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఎలాంటి సమస్యలు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేస్తోంది. రాష్ట్రాలు కోరిన సాయాన్ని అందిస్తోంది. వైద్య పరికరాలు అవసరమైన ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా వ్యవహారాలను ఎప్పటికప్పడు సమీక్షిస్తోంది.
శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు అవసరమైన సరుకులు, వస్తువులు రాష్ట్రాలకు సరఫరా అయ్యేలా చూస్తోంది ఎంహెచ్ఏ. వలస కార్మికులకు ఆశ్రమం, ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. హోంత్రి అమిత్ షాతో పాటు, సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానంద్ రాయ్ ప్రతిరోజు కార్యాలయానికి వెళ్తున్నారు. హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ భల్లా సహా సీనియర్ అధికారులు ప్రతిరోజు ఆఫీస్కు హాజరవుతున్నారు. సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు.