పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)పై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. హింసాత్మక ఘటనలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను పలు విపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు తప్పుపడుతున్న వేళ.. భద్రతా బలగాలకు మద్దతుగా నిలిచారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పోలీసులు తీరును సమర్థించారు. ఘర్షణలు చెలరేగిన సందర్భంలో కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. వారి విధి నిర్వహణకు కట్టుబడి లేనట్లే అవుతుందని స్పష్టం చేశారు.
"ఆందోళనలు అనేవి పోలీసుల ముందున్న సవాల్. అల్లర్లను ఎదుర్కొనేందుకు వారికి శిక్షణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పండి.. ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు నిప్పు పెడితే ఏం చేస్తారు. ఒక దుకాణానికి నిప్పుపెట్టారు.. అందులో కొంత మంది కూర్చొని ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి. ఆ సందర్భంలో పోలీసులు కాల్పులు చేయక తప్పదు. వారు అలా చేయలేదంటే వారి ఉద్యోగ బాధ్యత నిబద్ధతగా లేనట్లే. అల్లర్లు జరిగినప్పుడు ఘర్షణలు సృష్టించే వారిని పట్టుకోవాలి. అలాంటి ఘటనలను ఉపేక్షించకూడదు. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. సురక్షితమైన ప్రాంతంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నప్పుడు.. వేల మంది రాళ్లతో దాడి చేసేందుకు వస్తే పోలీసులు మనకు ధైర్యం చెబుతారు. మనల్ని, ప్రజలను కాపాడుతారు. ఈ విషయంలో నా ఆలోచన అదే."