వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'ఒడిశా జన్ సంవాద్' ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈసందర్భంగా భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలంటే విదేశీ ఉత్పత్తులను వాడొద్దని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
కరోనా కష్టకాలంలో భాజపా కార్యకర్తలు 11కోట్ల మంది పేదలకు ఆహారాన్ని అందించారని షా తెలిపారు. అందుకు సహకరించిన పార్టీ అధ్యక్షుడికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు.
గతంలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా.. ప్రధాని నరేంద్ర మోదీలా సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదన్నారు అమిత్ షా. 2019 ఆగస్టు 5న పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేశామని గుర్తు చేశారు. ఉరి, పుల్వామలో ఉగ్రదాడులు జరిగితే సర్జికల్ స్ట్రయిక్, మెరుపుదాడులు నిర్వహించి పాకిస్థాన్‌కు సరైన రీతిలో బుద్ధి చెప్పామన్నారు.
ఒడిశాలో 42 శాతం మందికి కులాయి నీటి సదుపాయం లేదన్నారు షా. 25కోట్ల మంది ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ 'జల్ జీవన్' కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. 2022నాటికి ఇది పూర్తవుతుందన్నారు.