తమిళనాడులో ఓ విద్యార్థి సెలవు కోసం ఉపాధ్యాయుడికి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సెలవుకు కారణాన్ని లేఖలో నిజాయితీగా పేర్కొన్నందున ఆ ఉత్తరం సర్వత్రా చర్చనీయాంశమైంది. అదేంటి? ఎలా? అనుకుంటున్నారా అయితే.. ఈ స్టోరీ చదవండి.
'రాత్రంతా కబడ్డీ.. ఒక్కరోజు సెలవు ఇవ్వండి సార్'
రాత్రి పడుకోకుండా కబడ్డీ మ్యాచ్ చూడటం వల్ల బాగా అలసిపోయానని.. అందుకే ఒకరోజు సెలవు కావాలని తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి.. ఉపాధ్యాయుడికి లేఖ రాశాడు. సెలవు కోసం అసత్యాలు చెప్పకుండా నిజాయితీగా కారణం చెప్పడం వల్ల ఈ ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తిరువరూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దీపక్.. పాఠశాల ఉపాధ్యాయుడికి సెలవు కోసం లేఖ రాశాడు. రాత్రంతా నిద్రపోకుండా కబడ్డీ మ్యాచ్ చూడటం వల్ల బాగా అలసిపోయానని, దయచేసి ఒక రోజు సెలవు ఇవ్వాలని కోరాడు.
విద్యార్థి నిజాయితీకి ఆశ్చర్యపోయిన ఉపాధ్యాయుడు సెలవు ఇచ్చాడు. ఆ లేఖను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. సెలవు చీటీని చూసిన నెటిజన్లు.. దీపక్‌ను ప్రశంసిస్తున్నారు. ఉత్తరంపై స్పందించిన దీపక్.. తనకు అసత్యాలు చెప్పడం నచ్చదని, భవిష్యత్‌లో ఐఏఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని తెలిపాడు.