దిల్లీ రైల్వే స్టేషన్‌లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, జితేంద్ర సింగ్‌లతో కలిసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చ జెండా ఊపారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి ప్రయాణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఆరంభమైందని అమిత్‌షా అన్నారు.
జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఇప్పటివరకు అవాంతరంగా నిలిచిందన్నారు షా. వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో జమ్ముకశ్మీర్ ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో అక్కడి ఆధ్యాత్మిక పర్యటక రంగానికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్కరూ పర్వత ప్రాంతంలో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. వైష్ణోదేవి ఆలయం వరకు వెళ్లనుంది. ఈ రైలు ప్రారంభంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేవారికి నూతన అనుభవం కలగనుంది. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో గాంధీ స్వదేశీ పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దిల్లీ నుంచి కత్రా వరకు వెళ్లనుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. మోదీ ఇచ్చిన స్ఫూర్తితో రైల్వే విభాగం మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ రైలును తయారు చేయడం చరిత్రలో నిలిచిపోతుంది."