కశ్మీర్లో ఉగ్రమూకలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అందింది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్(ఆపరేషన్స్) డాక్టర్ సైఫుల్లాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్ శివారులోని రంగ్రెత్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
బలగాల అతిపెద్ద విజయం- హిజ్బుల్ చీఫ్ హతం
కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ డాక్టర్ సైఫుల్లా హతమయ్యాడు. శ్రీనగర్ శివారులో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు ఇది అతి పెద్ద విజయమని కశ్మీర్ ఐజీపీ అన్నారు.
ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. దళాల ఉనికిని పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో సైఫుల్లా అక్కడికక్కడే హతమయ్యాడు. మరో ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సైఫుల్లాను మట్టుబెట్టడం పోలీసు, భద్రతా బలగాల అతి పెద్ద విజయమని, ఎన్‌కౌంటర్లో చనిపోయింది కచ్చితంగా అతనేనని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. ఉగ్రదాడులకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సైఫుల్లా ఆచూకీ కోసం చాలా రోజులుగా గాలిస్తున్నారు. గతంలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అప్పటి నుంచి సైఫుల్లాయే ఆ ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడు.