ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణవార్త సంగీత ప్రపంచంతో పాటు అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో భారత సంగీతం ఓ మధుర స్వరాన్ని కోల్పోయింది. ఆయనను ఓ గాన చంద్రుడిగా అభిమానులు పిలుస్తారు. పద్మభూషణ్ సహా ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయన కుటుంబం, సన్నిహితులు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను."
- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం కళా ప్రపంచానికి తీరని లోటు. ప్రతి ఇంట్లో మార్మోగిన ఆయన గళం దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి