దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దాడికి బాధ్యులమైన తమను అరెస్టు చెయ్యొచ్చని ప్రకటించారు హిందూ రక్షాదళ్ అధినేత పింకీ చౌదరి. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి చేసింది తామేనని సోమవారమే ప్రకటించారు పింకీ. అనంతరం నేడు అరెస్టు చేసుకోవచ్చంటూ వెల్లడించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గతంలో దాడి చేశానని పోలీసులకు వెల్లడించారు పింకీ చౌదరి. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడితే జేఎన్‌యూపై ఇదే విధంగా దాడులు చేస్తామని వెల్లడించారు.
పోలీసులు తన ఇంటికి వచ్చి అరెస్టు చేసుకోవచ్చని, ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా ఎలాంటి మార్పు జరగని కారణంగానే చట్ట వ్యతిరేక పంథాను ఎంచుకున్నట్లు వెల్లడించారు పింకీ. తన 150మంది అనుచరులు కూడా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధమన్నారు.
"జేఎన్‌యూ ఒక ఉగ్రవాదుల అడ్డాగా మారింది. అక్కడ చదువుకోవాలి.. కానీ అది జరగడం లేదు. అక్కడి వారు జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మేం దీన్ని సహించబోం. ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశానికి మద్దతివ్వాలి. వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలా మాట్లాడే వారిపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీకి అధికారం లేకపోవచ్చు. కానీ మేం తప్పకుండా చర్యలకు దిగుతాం."
-పింకీ చౌదరి, హిందూ రక్షాదళ్ అధ్యక్షుడు