తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నత విద్య.. నాణ్యత మిథ్య.. సంస్కరణలే శరణ్యం - eenadu sub feature news

దేశంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా విద్యా ప్రమాణాల విషయంలో మాత్రం పెద్దగా మార్పు లేదు. వేగంగా మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఉన్నత విద్యారంగ వైఫల్యం శాపమవుతోంది. అందుకే ఈ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

Higher education .. quality myth .. reforms are refuge
ఉన్నత విద్య.. నాణ్యత మిథ్య.. సంస్కరణలే శరణ్యం

By

Published : Jan 27, 2020, 6:28 AM IST

Updated : Feb 28, 2020, 2:35 AM IST

విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్నత విద్యలో అమెరికా, చైనా తరవాత భారతదేశం మూడో స్థానంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత దేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, విద్యా ప్రమాణాల విషయంలో పెద్దగా మార్పు లేదు. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగిత, నైపుణ్యాల లేమి, వ్యవసాయ దిగుబడుల తగ్గుముఖం... వంటి సమస్యలకు ఉన్నత విద్య ద్వారా పరిశోధనలే పరిష్కారం చూపాలి. ఈ విషయంలో వెనకబాటు దేశానికి సమస్యాత్మకం అవుతోంది. వేగంగా మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలోనూ ఉన్నత విద్యారంగ వైఫల్యం శాపమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పరంగా చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే మనదేశం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో, అంకుర పరిశ్రమల స్థాపనలో గుర్తింపు సాధించింది. భారతీయ మూలాలు గల విద్యార్థులు సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ళ వంటివారు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలకు ప్రధాన కార్యనిర్వాహక అధికారులు (సీఈఓలు)గా ఎదగడం భారతీయ విద్యార్థుల విజ్ఞాన ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఆంగ్లభాష పరిజ్ఞానం విషయంలోనూ భారతీయ యువకులు చైనా యువతకన్నా మిన్నగా ఉంటారు. భిన్న సంస్కృతి సంప్రదాయాలు, మతాలు, భాషలు కలిగి ఉండే భారతీయులు ఏ దేశ ప్రజలతోనైనా సులభంగా కలిసిపోతుండటం అవకాశాల విస్తృతికి ఎంతగానో దోహదపడుతుంది!

పోస్టులు ఖాళీ ఎన్నో..

సిబ్బంది కొరత ఉన్నత విద్యారంగం నాణ్యతను దెబ్బతీస్తోందన్నది చేదు నిజం. విశ్వవిద్యాలయాల సంఘం నివేదిక ప్రకారం 35 శాతం ఆచార్య పోస్టులు, 46 శాతం సహాయ ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సహాయ ఆచార్యుల స్థాయిలోనే ఒప్పంద అధ్యాపకులు సేవలు అందజేస్తుండటం- నాణ్యమైన విద్య విషయంలో ప్రభుత్వాలు రాజీ పడుతున్నాయని చెప్పడానికి దాఖలా. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధుల కేటాయింపుల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 65 శాతం నిధులు; రాష్ట్ర వర్సిటీలు, అనుబంధ కళాశాలలకు కేవలం 35 శాతం నిధులు సమకూరుతుండటం మరో వైపరీత్యం. పరిశోధన-అభివృద్ధిపై వెచ్చిస్తున్న నిధులు జీడీపీలో 0.6 శాతం నుంచి 0.7 శాతమే ఉంటున్నాయి. ఈ కేటాయింపులు అమెరికాలో 2.8 శాతం, చైనాలో 2.1శాతం, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం ఉన్నాయి. పరిశోధనల్లో దేశ ఉదాసీన వైఖరికి ఈ కేటాయింపులే నిదర్శనం. జాతీయ స్థాయిలో ప్రతి లక్ష జనాభాకు 28 కళాశాలలు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుంది. 59 కళాశాలలతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, అతి తక్కువగా తొమ్మిది కళాశాలలతో బిహార్‌ చివరి స్థానంలో ఉంది.

ఎంతమందికి విద్యార్థులకు ఎందరు ఉపాధ్యాయులు?

పేరుగల ఉన్నత విద్యాసంస్థలు ఎక్కువగా పెద్ద నగరాల్లో కేంద్రీకృతమయ్యాయి. భారత దేశంలో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. ఈ నిష్పత్తి అమెరికాలో 12.5:1, చైనాలో 19.5:1గా ఉంది. ఉన్నత విద్యలో నాణ్యతకు సరికొత్త ప్రామాణికాలు ఏర్పడిన రోజులివి. అధునాత ప్రయోగశాలలు, అంతర్జాల సౌకర్యాలు, ఎలక్ట్రానిక్‌ గ్రంథాలయాలు చదువుల్లో విద్యార్థులను ముందుంచే ఆధునిక మౌలిక సౌకర్యాలుగా మారాయి. అనేక విద్యాసంస్థల్లో వీటికి కొరత అపారంగా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఎక్విప్‌’ (ఎడ్యుకేషన్‌ క్వాలిటీ అప్‌గ్రెడేషన్‌, ఇంక్లూజన్‌ ప్రోగాం) ద్వారా రాబోయే అయిదేళ్లలో కనీసం 50 ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యత మెరుగుదల చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా ప్రపంచంలోని వెయ్యి విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించాలని సంకల్పించింది.

విద్యలో నాణ్యతను మెరుగుపరచడానికి ఎన్నో కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ‘రైజ్‌‘ (రివైటలైజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌) కార్యక్రమం ద్వారా 2022నాటికి ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించి, పరిశోధనకు పెద్దపీట వేస్తున్నారు. నిపుణులైన విదేశీ అధ్యాపకుల సేవలను ఆహ్వానించే అవకాశం కల్పిస్తున్నారు. ‘నిర్ఫ్‌’ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ద్వారా 2016 నుంచి గ్రేడ్లు మంజూరు చేస్తూ ఉన్నత విద్యలో నాణ్యత పెంచడానికి కృషి సాగుతోంది. ‘స్టార్స్‌’ (స్కీమ్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌), ఐఐఎస్‌సీ బెంగళూరు ద్వారా అధ్యయన కార్యక్రమాలను మంజూరు చేస్తున్నారు. ‘రుసా’ (రాష్ట్రీయ ఉచ్చతార్‌ శిక్షా అభియాన్‌) ద్వారా ఆదర్శ కళాశాలల స్థాపన, అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నారు. ‘ఇంప్రెస్‌’ (ఇంపాక్ట్‌ఫుల్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌) ద్వారా సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహికులు ఆన్‌లైన్‌ ద్వారా హైస్కూలు స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే అవకాశాన్ని ‘స్వయం’ పథకం కల్పిస్తోంది.

ఉన్నతవిద్యలో పరిశోధ]న-అభివృద్ధికి నిధులు ఎంతగానో అవసరం. వాటి అమలు పర్యవేక్షణ నిరంతర ప్రక్రియగా సాగాలి. మారుతున్న సమాచార, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను పాఠ్యప్రణాళికల్లో ఎప్పటికప్పుడు చేర్చడం ద్వారా మేధావలసకు అడ్డుకట్ట వేయవచ్చు. వ్యవసాయానికి సాంకేతికత జోడించడం ద్వారా ఆహార ఉత్పాదకతను పెంచవచ్చు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉన్నత విద్య నాణ్యత ప్రమాణాలను కొనసాగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, సంకల్పదీక్ష, వనరుల సద్వినియోగం ఎంతో అవసరం. విద్యారంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు విధి నిర్వహణను పవిత్రమైన సామాజిక బాధ్యతగా భావించాలి. ప్రాచీన భారతంలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఎనలేని ఖ్యాతి సంపాదించడానికి అప్పటి గురువుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి ఉండటమే కారణం. శిష్యుల అంకితభావంతో విద్యనభ్యసించేవారు. నాటి సంప్రదాయాలు నేటికీ ఎంతైనా అనుసరణీయం. అప్పుడే భారతదేశం విద్యాబోధనకు ప్రపంచస్థాయి కేంద్రంగా విరాజిల్లుతుంది.

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య
(రచయిత- వాణిజ్యశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)

Last Updated : Feb 28, 2020, 2:35 AM IST

ABOUT THE AUTHOR

...view details