బిహార్ ముజఫర్‌పుర్‌లో అనుమానిత అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) బారినపడి మరణించిన చిన్నారుల సంఖ్య 104కు చేరిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వెంటనే ముజఫర్‌పుర్‌లో 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ డిసిప్లీనరీ రీసర్చ్ సెంటర్' ఏర్పాటు చేసేందుకు మరో ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని పంపాలని ఆదేశించారు.
బిహార్‌లో పర్యటించిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్), ఎయిమ్స్‌కు చెందిన సీనియర్ అధికారులతో రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షించారు హర్షవర్ధన్.
" వ్యాధికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి పరిశోధనా బృందం అవసరం. ఏఈఎస్ తో బాధపడుతున్న పిల్లలను ఈ బృందం పరిశీలిస్తుంది. వ్యాధి కాలం, పరివర్తన, పర్యావరణ కారకాలు, మెట్రోలాజికల్ డేటా, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారాన్ని సూచిస్తుంది. "
- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి