గత 16 ఏళ్లుగా భారత్- చైనాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల ద్వారా పెద్దగా ఫలితాలు రాకపోయినా.. ఇరుదేశాలు చర్చలు ద్వారా ఓ సానుకూల ఫలితం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యలపై చర్చించడానికి నియమించిన ప్రత్యేక ప్రతినిధుల సమావేశం డిసెంబర్ 21న జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనైనా సరిహద్దు సమస్యలకు పరిష్కారం కనుగొంటారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
వాజ్‌పేయీ హయాంలో మొదలు
సరిహద్దు సమస్యను పరిష్కరించడం కష్టతరమనే విషయాన్ని భారత్, చైనాల మధ్య ఇదివరకు జరిగిన 21 సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యున్నత స్థాయి ప్రతినిధులను నియమించి సరిహద్దు సమస్యలపై చర్చించుకోవాలని అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, చైనా అధ్యక్షుడు హూ జింటావో 2003లో నిర్ణయించారు. ఏ రూపంలో సమస్యను పరిష్కరించాలనే విషయాన్ని అదే సమావేశంలో చర్చించారు.
2005లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని వెన్ జియాబావో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిమితులు, పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. దీని ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఆ ప్రాంత ప్రధాన భౌగోళిక లక్షణాలు, జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. వీటితోపాటు వాస్తవాధీన రేఖను ఇరుదేశాల అంగీకారంతోనే నిర్ణయించుకోవాలని అనధికారంగా తీర్మానించారు. ఆ తర్వాత చైనా ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు, వాస్తవాధీన రేఖను నిర్ణయించకపోవడం వంటి కారణాలతో దీనిపై వెనకడుగువేసింది.
అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్ వివాదాలు
1962లో జరిగిన యుద్ధంలో చైనా భారత భూభాగంలోకి బలవంతంగా చొచ్చుకొచ్చింది. భారత అధీనంలో ఉండే అక్సాయిచిన్లోని 34 వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆక్రమించింది. భారత్‌కు తూర్పున ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం చైనా తనదిగా చెప్పుకుంటోంది. ఆ ప్రాంతాన్ని లోయర్ టిబెట్‌గా చైనా పరిగణిస్తోంది. బ్రిటీష్ హయాంలో ఆయా ప్రాంతాల్లోని స్థానిక పాలకులు చేసుకున్న ఒప్పందాలను చైనా లెక్కచేయడంలేదు.
వెనకడుగేయని భారత్
14 దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న చైనా.. దాదాపు అన్ని దేశాలన్నింటితో వివాదాలను పెట్టుకుంది. అప్పటి సోవియట్ యూనియన్, వియత్నాంలతో యుద్ధాలు కూడా చేసింది. తనకున్న ఆయుధ సంపత్తి, ఆర్థిక శక్తులతో భూటాన్, భారత్‌లను మినహాయించి అన్ని దేశాల సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోగలిగింది. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందాలన్నీ చైనాకు అనుకూలంగా చేసుకుంది. ఎప్పుడూ చైనాకు వంతపాడే పాకిస్థాన్ అయితే ఏకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని భూభాగాన్ని ఆ దేశం చేతిలో పెట్టింది. భారత్‌తో పోలిస్తే ఐదు రెట్ల పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా చైనాతో సరిహద్దు సమస్యలపై భారత్ వెనకడుగువేయలేదు. డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు భూటాన్‌కు మద్దతుగా భారత సైన్యం జోక్యం చేసుకోవడాన్ని చైనా అస్సలు సహించలేదు. యుద్ధం పేరుతో భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే సైనిక బలాన్ని, ఆర్థిక శక్తిని చూపించి భారత్‌ను అడ్డుకోవడం సాధ్యం కాదని చైనా ఇప్పుడు గ్రహించింది.