తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రసవత్తరంగా 'రాజ'కీయం- ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు - bsp mlas served notices to rajasthan mlas

రాజస్థాన్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్​లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగస్టు 11 లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బలాబలాలు మారే పరిస్థితి కన్పిస్తోంది.

gehlot
రసవత్తరంగా 'రాజ'కీయం..ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

By

Published : Jul 30, 2020, 7:48 PM IST

రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో విలీనం అయిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారితో పాటు స్పీకర్‌ సీపీ జోషి, అసెంబ్లీ కార్యదర్శికి ఈ తాఖీదులు వెళ్లాయి. విలీనంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

'విప్ ధిక్కరిస్తే అనర్హత తప్పదు'

2018 ఎన్నికల్లో గహ్లోత్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సాయపడిన ఆరుగురు ఎమ్మెల్యేలు గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తాజాగా బీఎస్పీ రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదించారు. జాతీయ స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ ఏ పార్టీలోనూ బీఎస్పీ విలీనం కాలేదని చెప్పారు. పార్టీలు తప్ప వ్యక్తులు విలీనం అవ్వడానికి లేదని వాదించారు. ఇప్పటికీ వారు బీఎస్పీకి రాజీనామా చేయలేదని, ఒకవేళ వారు విప్‌ ధిక్కరిస్తే అనర్హత వేటుకు అర్హులని పేర్కొన్నారు.

బలబలాలు మారేనా..

తాజా పరిణామంతో సీఎం అశోక్‌ గహ్లోత్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుని సచిన్‌ పైలట్‌ వర్గానికి చెక్‌ పెట్టాలని భావిస్తున్న ఆయనకు.. బీఎస్పీ ఎమ్మెల్యేల రూపంలో మరో సమస్య ఎదురైంది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గహ్లోత్‌ చెప్పుకొస్తున్నారు. అందులో వీరు (బీఎస్పీ నుంచి విలీనం అయినవారు) కూడా ఉన్నారు. ఒకవేళ పైలట్‌ వర్గంపై అనర్హత వేటు పడినా.. స్వతంత్రులు, ఇతర పార్టీ మద్దతుతో గట్టెక్కొచ్చని భావించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి వారికి నోటీసులు వెళ్లడం గమనార్హం.

200 సీట్లున్న రాజస్థాన్‌లో సాధారణ మెజార్టీకి 101 సీట్లు అవసరం. ప్రస్తుతం సచిన్‌ పైలట్‌ వర్గంలో ఆయనతో పాటు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. ఆర్‌ఎల్పీ (3) సభ్యులతో కలిపి భాజపాకు 75 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశ పరిచేందుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాజస్థాన్‌ రాజకీయం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

ఇదీ చూడండి:ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టుకు బీఎస్పీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details