తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2019, 7:50 AM IST

ETV Bharat / bharat

దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్ర కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబయి సహా జమ్ముకశ్మీర్​, పంజాబ్​ రాష్ట్రంలో కుట్రలకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించాయి. జైషే మహమ్మద్​ అధినేత మసూద్​ అజార్​ తమ్ముడు రవూఫ్​ అస్ఘర్​ పీఓకేలోకి ప్రవేశించినట్లు తెలిపాయి.

దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర-హై అలర్ట్​

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులకు తెగబడేందుకు జైషే మహమ్మద్​ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్ముకశ్మీర్​లో భద్రతా సిబ్బందిని అధిక సంఖ్యలో బలిగొనేందుకూ ఉగ్ర మూక ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించాయి.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ-370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మనదేశంలో దాడులను ముమ్మరం చేయాలని జైషే మహమ్మద్​ యోచిస్తోందని నిఘా వర్గాల సమాచారం. ముంబయిలో విధ్వంస రచన బాధ్యతను ముగ్గురు ఉగ్రవాదులతో కూడిన బృందానికి జైషే అప్పగించినట్లు పేర్కొన్నాయి. నగరంలో స్లీపర్​ సెల్స్​ ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పీఓకేకు మసూద్​ తమ్ముడు...

జైషే మహమ్మద్​ అధినేత మసూద్​ అజార్​ తమ్ముడు రవూఫ్​ అస్ఘర్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లోకి మంగళవారం ప్రవేశించాడు. అంతకుముందు అతడు రావల్పిండిలో పలు సమావేశాల్లో పాల్గొన్నాడు. పాక్​లోని పంజాబ్​ నుంచి జైషే ఉగ్రవాదులు అధిక సంఖ్యలో భారత సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పేందుకు రవూఫ్​ రాక సంకేతంగా చెప్పొచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి.

పంజాబ్​లో హై అలర్ట్​...

అధికరణ-370 రద్దు నేపథ్యంలో జైషే మహమ్మద్​, లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పంజాబ్​లో ఆత్మాహుతి దాడులకు తెగబడే ముప్పుందని నిఘా సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్​ ప్రకటించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్​ సరిహద్దుల్లోని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.

ఇదీ చూడండి: భారత్​తో వాణిజ్య సంబంధాలు రద్దు! పాక్​ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details