అయోధ్య కేసు: సుప్రీంలో ఎవరి వాదనేంటి? అయోధ్య భూవివాదం వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానంలో 40 రోజులపాటు నిర్విరామంగా వాదనలు జరిగాయి. కక్షిదారుల ఆస్తి హక్కులు, కేసులో వారి అర్హతలు సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 2.77 ఎకరాల భూమిపై హక్కు కోసం సుప్రీం వేదికగా హిందూ, ముస్లిం వర్గాలు వాడీవేడిగా తలపడ్డాయి. మరి ఎవరి వాదనేమిటో ఓసారి పరిశీలిస్తే...
హిందూ పక్షాల వాదనలు
అయోధ్యలో రామాలయాన్ని ఇంచుమించుగా 11వ శతాబ్దంలో విక్రమాదిత్య చక్రవర్తి నిర్మించి ఉంటారని.. ఆ గుడిని 1526లో బాబర్ లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ధ్వంసం చేసుంటారని హిందూ పక్షాలు సుప్రీంలో వాదించాయి. వాల్మీకి రామయాణం, స్కంద పురాణం, వశిష్ఠ సంహిత వంటి పురాతన గ్రంథాలు, క్రీస్తు శకం 400 సంవత్సరంలో 'ఫా హియన్', 600-670 మధ్యలో 'హ్యుయెన్‌త్సాంగ్' వంటి యాత్రికుల రచనల్లో అయోధ్య, అక్కడి పూజల ప్రస్తావన ఉందని తెలిపాయి.
బాబర్ సరయూ నదిని దాటి అయోధ్య చేరినట్లు తన పుస్తకం 'బాబర్‌నామా'లో రాశారని, కానీ అక్కడ మసీదు ఉన్నట్లు ఆయన ప్రస్తావించలేదని కోర్టుకు నివేదించాయి. వీటితో పాటు హిందూ వర్గాలు సుప్రీంలో వినిపించిన వాదనలివి..
- మొఘల్ చక్రవర్తులు రచించిన 'ఐనీ అక్బరీ', 'తుజుక్ ఎ జహంగిరీ'లోనూ అయోధ్య నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు వేర్వేరు రికార్డుల్లో దీన్ని నమోదు చేశారు.
- బాబ్రీ మసీదుపై ఇస్లామిక్ రచనలు కొన్ని... పవిత్ర ఖురాన్, హదిత్‌కు విరుద్ధంగా ఉన్నాయి.
- రాముడి జన్మస్థానం అయోధ్యేనన్న విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయి. జన్మస్థానంలో పూజలు చేసే హిందువుల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
- వివాద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని, అది ధ్వంసమైందని పురావస్తు శాఖ నివేదిక కూడా చెబుతోంది.
- మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అయితే రామజన్మ భూమి ఒక్కటే ఉంది.
ముస్లిం పక్షాల వాదనలు
ముస్లిం వర్గాలు మరో కోణంలో వాదించాయి. వివాదాస్పద ప్రాంతంలో 1528 నుంచి మసీదు ఉండేదని తెలిపాయి. 1855, 1934లో ఈ ప్రార్థనా మందిరంపై దాడులు జరిగినట్లు రికార్డుల్లో నమోదైందని, 1949లో చొరబాటు కేసు కూడా దాఖలైందని.. ఇవన్నీ మసీదు ఉనికిని నిర్ధరిస్తున్నట్లు వాదనలు వినిపించాయి.
వాల్మీకి రామాయణం కానీ, రామచరిత మానస్ కానీ.. అయోధ్యలో రాముడి జన్మ ప్రదేశాన్ని నిర్దిష్టంగా నిర్వచించలేదని సుప్రీంకు నివేదించాయి. వీటితో పాటు ముస్లిం పక్షాల వాదనలు ఏమిటంటే..
- మసీదుకు బాబర్ నిధులు ఇచ్చినట్లు, దాన్ని ఆ తర్వాత నవాబులూ కొనసాగించినట్లు బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించింది.
- 1885లో దాఖలైన దావాలో సమర్పించిన అనేక పత్రాలు ఈ మసీదు ఉనికిని ధ్రువపరుస్తున్నాయి. ఆ స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేది. 1949 డిసెంబరు 22, 23 తేదీల వరకూ అక్కడ ఈద్ ప్రార్థనలు జరిగాయి.
- రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. అక్కడ ఆలయం ఉండేదని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా, అసంపూర్తిగా ఉంది. అది వ్యాఖ్యానమే. శాస్త్రీయ ఆధారం కానేకాదు.
- 1989 వరకూ హిందువులు ఆ వివాదాస్పద స్థలంపై హక్కులు కోరలేదు. ఆ ప్రదేశాన్ని మాకు అప్పగించాలని మేం మొదట దావా వేశాం. ఆ తర్వాతే హిందువులు పిటిషన్ వేశారు.
- వివాదాస్పద ప్రాంతంలోని 'రామ్ ఛబుత్ర', 'సీతా రసోయి' హిందువుల అధీనంలో ఉన్నంత మాత్రాన వారికి స్థల యాజమాన్య హక్కులు దక్కవు. ప్రార్థనా హక్కులు మాత్రమే లభిస్తాయి.
- 1992 డిసెంబరులో కూల్చివేతకు గురికావడానికి ముందున్న రీతిలో బాబ్రీ మసీదును పునరుద్ధరించాలి.