సాధారణంగా సెలవులు వస్తే క్షణం తీరిక లేకుండా తిరుగుతూ సందడి చేస్తుంటాం. కానీ కొవిడ్ -19ను అరికట్టడంలో భాగంగా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏం చేయాలో తెలియక విసుగు చెందుతాం. మరి ఈ సమయంలో విసుగు రాకుండా ఇంట్లో ఈ పనులు చేసుకోవడం వల్ల ఆనందంగా ఉండొచ్చని చెబుతున్నారు విశ్రాంత ఇంజినీరు కృష్ణాదిశేషు పెంటపాటి. మరి అవేంటో చూద్దామా!
"రానున్న మూడు వారాలు ఇంట్లో ఖాళీ ఉండేవారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవడం, ఇంటి ఆరు బయట మొక్కలు పెంచడం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడుకోవటం, పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పడం వంటి పనులు చేయడం ఉత్తమం" అని అంటున్నారు కృష్ణాదిశేషు.
ఇంట్లో వ్యాయామాలు
ఎలాంటి పని లేకుండా ఇంట్లో ఉండడం చాలా కష్టం. ఈ సమయంలో మానసిక, శారీరక బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగించేందుకు వ్యాయామం, యోగా చేయడం ఉత్తమం. తేలిక పాటి వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. సంగీతం వింటూ సంతోషంగా గడిపేయండి.
జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి
కుటుంబ సభ్యులంతా ఒక్క చోట ఉన్నప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇందుకు కుటుంబ సభ్యులు అంతా కలిసి దిగిన ఫోటోలు, పాఠశాలలు, కళాశాలలు, పెళ్లి నాటి ఫోటోలు చూడటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వాటిని మీ పిల్లలకు, వాళ్ల పిల్లలకు చూపించడం మరింత బాగుంటుంది. వీటి ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు నేర్పొచ్చు.
భాగస్వామితో సరదాగా గడపండి
ఈ ఖాళీ సమయంలో భార్యాభర్తలు వివాహ ప్రారంభ రోజుల్ని గుర్తుచేసుకోండి. మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి కారణాలు, వారిలో మీకు నచ్చిన విషయాలు మనసు విప్పి మాట్లాడుకోండి. మీ భార్యకు వంట, ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉండండి. భవిష్యత్తు ప్రణాళికలు పంచుకోండి. పనుల్లో ఒకరికి మరొకరు సాయం చేసుకోవడం వల్ల పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు.
మొక్కలను సంరక్షించండి
మనలో చాలామందికి మొక్కల పెంపకం చాలా ఇష్టమైన పని. కానీ చాలా మందికి ఇతర పనుల వల్ల సమయం కేటాయించలేరు. అలాంటి వారికి ఇదో మంచి అవకాశం. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మీ మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించుకోండి. వాటితో అధిక సమయాన్ని కేటాయించండి. కూరగాయలు, పూల మొక్కల్ని అధికంగా పెంచండి.