తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 11:19 AM IST

ETV Bharat / bharat

'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్​.. మధురై వైద్యుడి ఘనత!

తమిళనాడుకు చెందిన ఓ సిద్ధ వైద్యుడు కరోనాను ఎదుర్కొనేందుకు మూలికా ఔషధాన్ని తయారు చేశాడు. తాను తయారు చేసిన ఔషధాన్ని పరీక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న ధర్మాసనం.. మందును పరిశీలించాలని సిద్ధ, ఆయుర్వేద మండలికి సిఫార్సు చేసింది. మరోవైపు తమిళనాడుకు చెందిన రెండు ప్రముఖ సిద్ధ వైద్య సంస్థలు అతిపెద్ద డేటాబేస్​ను రూపొందించే పనిలో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే పరిశోధనల్లో ఉపయోగించడానికి యాప్​ను రూపొందించాయి.

Herbal medicine has Immune power, Tamil Nadu Govt Informs High Court
కరోనాకు సిద్ధవైద్యం- మూలికా ఔషధాన్ని తయారు చేసిన వైద్యుడు!

కరోనా నివారణకు మూలికా ఔషధం కనిపెట్టానంటూ తమిళనాడులోని మధురైకి చెందిన సిద్ధ వైద్యుడు ఎస్​. సుబ్రహ్మణ్యం ప్రకటించుకున్నాడు. తన ఔషధాన్ని పరీక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

కరోనా నివారణకు..

ఈ ఔషధాన్ని 66 మూలికలతో తయారు చేసినట్లు పిటిషనర్ చెప్పుకొచ్చాడు. పౌడర్ రూపంలో ఉండే ఈ మందు కొవిడ్-19ను నయం చేస్తుందని పేర్కొన్నాడు. ఈ చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవాలని తెలిపాడు. ఇలా రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. అదే సమయంలో కరోనా నివారణగా పనిచేస్తుందని వెల్లడించారు.

'ఇంప్రో' పేరిట తీసుకొచ్చిన ఈ మందును నిపుణుల బృందం పరిశీలించింది. వైరస్​తో పోరాడే విధంగా దీనికి రోగనిరోధకతను పెంపొందించే శక్తి ఉన్నట్లు తెలిపింది.

ఈ వాదనలన్నింటినీ విన్న ధర్మాసనం ఔషధాన్ని పరిశీలించాలని సిద్ధ ఆయుర్వేద మండలికి సిఫార్సు చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది.

సిద్ధ వైద్యానికి పెద్ద పీట!

మరోవైపు సంప్రదాయ ఔషధ పద్ధతులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమిళనాడుకు చెందిన రెండు ప్రముఖ సిద్ధ వైద్య సంస్థలు కలిసి అతిపెద్ద డేటాబేస్​ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ మేరకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ సిద్ధ(సీసీఆర్​ఎస్), నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ(ఎన్​ఐఎస్) సంయుక్తంగా 'ఆయుష్ సంజీవని' మొబైల్ యాప్​ను రూపొందించాయి. భారత్​ సహా విదేశాల్లో ఉన్న ప్రజలు కరోనా నుంచి తమను తాము కాపాడుకునేలా ఈ యాప్​ను తయారు చేశాయి.

భవిష్యత్​ అవసరాలతో పాటు సిద్ధ వైద్యానికి ప్రామాణికతను తీసుకురావడానికి ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్​ ద్వారా సెంట్రల్ టాస్క్​ ఫోర్స్ నిర్వహించే అధ్యయనాల్లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర వైద్య శాఖ, భారత వైద్య పరిశోధనా మండలికి చెందిన పరిశోధకులు పాల్గొననున్నారు.

"ఆయుష్ సంజీవని మొబైల్ యాప్​ ద్వారా వంద కోట్ల మంది వినియోగదారుల మద్దతును పొందాలనుకుంటున్నాం. సిద్ధ ప్రాక్టీషనర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు, రోగులను ఇందులో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. సిద్ధ వైద్యంపై వీరందరి అనుభవాలను యాప్​లో నమోదు చేసి.. రోగనిరోధకత శక్తిని పెంపొందించడానికి అధ్యయనం చేస్తాం. ఈ డేటాబేస్ ఒక ఎవిడెన్స్-ఆధారిత వ్యవస్థగా ఉంటుంది."

-డా. కే కనకవల్లి, సీసీఆర్​ఎస్ డైరెక్టర్ జనరల్

సిద్ధ వైద్యంతో పాటు కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని సీసీఆర్​ఎస్​ మాజీ డైరెక్టర్ ఆర్​ఎస్ రామస్వామి పేర్కొన్నారు. ఈ యాప్​ రూపొందించడం ఒక మంచి ప్రయత్నమని ఆయుష్ మంత్రిత్వ శాఖ కొనియాడినట్లు తెలిపారు. డెంగ్యూ, చికెన్​ గున్యా వంటి రోగాలను నయం చేయడంలో ఈ ఔషధాల సామర్థ్యాన్ని సిద్ధ వైద్యులు గతంలోనే ప్రదర్శించారని గుర్తుచేశారు.

ఇదీ చదవండి-డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ABOUT THE AUTHOR

...view details