కొందొ గిరిజన తెగకు చెందిన 'జులిమా' పేద కుటుంబంలో పుట్టింది.ఆమెది ఒడిశాలోని బంధుడి ప్రాంతం. పేదరికం కారణంగా పదో తరగతిలోనే చదువు ఆపేసిన జులిమా.. కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం కూలి పనులకు వెళ్లేది. ఆ సమయంలోనే ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీరుగా చేరి... బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టింది. తన గ్రామంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకునేది. ఇప్పటిదాకా తమ తెగకు చెందిన కుటుంబాల్లో జరిగే పన్నెండు బాల్య వివాహాలను ఆపింది.
తాను ఓపెన్ స్కూల్ ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే, చదువును మధ్యలో ఆపేసిన తోటి స్నేహితురాళ్లను పాఠశాలల్లో చేర్పించడం, నైపుణ్య శిక్షణల వైపు దృష్టి మరల్చడంలో జులిమా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం బాలల హక్కులను రక్షించడం, వివిధ జిల్లాల్లో బాల్య వివాహాల నియంత్రణకు ఆమె కృషి చేస్తోంది. ఆమె చేసిన కృషికే యునిసెఫ్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా పది మంది ఎంపికవగా వారిలో జులిమా ఒకరు.