ఉత్తర్ప్రదేశ్ మథురలో కోతుల బెడద తీవ్రంగా ఉందని భాజపా ఎంపీ, సినీ నటి హేమమాలిని పేర్కొన్నారు. తీర్థ స్థలమైన బృందావన్లో కోతులకు ఫ్రూటీ, సమోసా, కచోరీలను యాత్రికులు అలవాటు చేస్తున్నారని.. ఫలితంగా అవి అనారోగ్యం పాలవుతున్నాయని తెలిపారు.
కోతులకు ప్రత్యేక సఫారీ ఏర్పాటు చేసి అక్కడి స్థానికులతో పాటు కోతుల సమస్యను తీర్చాలని పార్లమెంటు వేదికగా అటవీ శాఖను కోరారు హేమమాలిని. అయితే ఈ విషయాన్ని నవ్వులాటగా కాకుండా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
"నా నియోజకవర్గం మథుర.. బృందావన్, గోవర్ధన్ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. అక్కడికి వచ్చే యాత్రికులు కోతులకు ఫ్రూటీ, కచోరీ, సమోసాలను తినిపిస్తున్నారు. ఈ కారణంగా అవి అనారోగ్యం పాలవుతున్నాయి. వాటి నుంచి మిగతా వాటికి, మనుషులకూ ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వీటి సంఖ్యను తగ్గించేందుకు వైద్యులు స్టెరిలైజ్ చేశారు. దీనివల్ల అవి హింసాత్మకంగా మారాయి. ఆహారం కోసం దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో మనుషులు మరణించిన సంఘటనలూ బృందావన్లో జరిగాయి. ఈ భూమి మీద మనలాగే వాటికి జీవించే హక్కు ఉంది. కోతుల కోసం ప్రత్యేక సఫారీని ఏర్పాటు చేయాలని అటవీశాఖను కోరుతున్నా."