కన్నడనాట రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్- జేడీఎస్ కూటమి విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు భాజపా సోమవారమే విశ్వాసపరీక్ష పెట్టేలా కుమారస్వామిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకొంది.
కూటమి సఫలం..!
రెబల్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చేందుకు కూటమి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును దారికి తెచ్చుకోవడమే కాక ఆయన ద్వారా మరో శాసనసభ్యుడు సుధాకర్‌ని కూడా రాజీనామా వెనక్కి తీసుకునేందుకు ఒప్పించేలా చేశారు.
శనివారం ఉదయం అసంతృప్త ఎమ్మెల్యే నాగరాజు నివాసానికి వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ మధ్యాహ్నం వరకు ఆయనతో మంతనాలు జరిపారు. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటిలో నాగరాజుతో మంతనాలు సాగాయి.
ఈ చర్చల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేపీసీసీ ఛీప్ దినేశ్ గుండురావుతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా సాయంత్రం పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కితీసుకోవడం సహా కాంగ్రెస్‌లోనే కొనసాగేలా నాగరాజును ఒప్పించడంలో... కొంత వరకు సంకీర్ణకూటమి నేతలు విజయం సాధించారు.
"ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. విశ్వాసపరీక్ష నాటికి రాజీనామాలిచ్చిన ఎమ్‌ఎల్‌ఏలు అందరూ తిరిగి వస్తారన్న విశ్వాసం మాకుంది." - సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్ణాటక సభాపక్ష నేత