దక్షిణాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కేరళలో తీవ్రగాలులతో పాటు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఇడుక్కి జిల్లా రాజమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
ముంచెత్తిన వర్షాలు- కర్ణాటక, కేరళ జలదిగ్బంధం వయనాడ్‌లో నీట మునిగిన ఇల్లు ఇడుక్కిలో విరిగిపడిన కొండచరియలు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఆళువాలో పెరియార్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడి శివాలయం పైకప్పు వరకు నీరు చేరింది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాకు ఇంకా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఎర్నాకులం జిల్లా నెరియామంగళంలో రెండు ఏనుగులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
కర్ణాటకలో...
కర్ణాటకలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో చాలా జిల్లాల్లో భారీగా వరద నీరు చేరింది. మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పై నుంచి నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది.
బెలగావిలో నీట మునిగిన పంటభూములు
కొడగు జిల్లాలో గడిచిన రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 105 సెం.మీ వర్షం కురిసింది. జిల్లాలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నాపకళ్లులో కావేరీ నది ప్రమాద స్థాయికి 60 సెం.మీ దిగువన ప్రవహిస్తోంది.
కలబుర్గిలోని భీమా నదిలో వరద నీటి ఉద్ధృతి పెరిగింది. బెలగావిలో వ్యవసాయ భూములు జలమయం అయ్యాయి. చిక్కమగళూరులో కొండచరియలు విరిగిపడ్డాయి. అలగేశ్వర రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
సహాయక చర్యలు ముమ్మరం..
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధికారులు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి:మునిగిన ముంబయి.. ఎగసిపడుతున్న అలలు