తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరదలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం - వరదలు

నైరుతీ రుతుపవనాలు మహారాష్ట్రలో అత్యంత ప్రభావవంతంగా చూపుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబయి సహా ఠాణెతో పాటు మరికొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో ముంబయి మహానగర రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మహారాష్ట్ర

By

Published : Jul 28, 2019, 4:51 AM IST

Updated : Jul 28, 2019, 8:05 AM IST

ముంబయిలో వరద పోటు

ముంబయిపై వరణుడు మళ్లీ ఆగ్రహించాడు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబయితో సహా శివారు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వానల బీభత్సానికి ముంబయి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నదులు, వాగులు పోటెత్తాయి.

వరద ఉద్ధృతి నుంచి ప్రజలను కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్​డీఆర్​ఎఫ్​)కు చెందిన 8 బృందాలు కృషి చేస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాయి. నౌకాదళానికి చెందిన 3 బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

రవాణా వ్యవస్థకు అంతరాయం

ముంబయిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకలపైనా తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాల కారణంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11 విమానాల రాకపోకలను నిలిపేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. స్థానిక రైళ్ల రాకపోకలకు పెద్దగా అంతరాయం ఏర్పడలేదని మధ్య రైల్వే తెలిపింది.

ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలోని బద్లాపుర్​లో పట్టాలపై పూర్తిగా వరద నీరు చేరి మహాలక్ష్మీ ఎక్స్​ప్రెస్ నిలిచిపోయింది​. 12 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు... రైలులో ఉన్న 1050 మంది ప్రయాణికులను రక్షించారు.

ఆదివారమూ వర్షాలే!

నిన్నటి నుంచి ముంబయిలో 21 సెంటీమీటర్లు, తూర్పు, పశ్చిమ శివార్లలో 16,13 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఆదివారం కూడా ముంబయి పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ (బీఎంసీ) సన్నద్ధమయింది.


ఇతర జిల్లాల్లో..

రాయ్​గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇప్పటికే మాతుంగ, సియాన్, మాహీం, అంధేరీ, మలాద్, దహిసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రత్నగిరి జిల్లాలో జగ్బుడీ నది పొంగిపొర్లటం వల్ల ముంబయి-గోవా జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

నాసిక్​లో...

నాసిక్‌లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. సమీపంలోని జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి.

ఠాణెలోని కంబాలో వరదల్లో చిక్కుకున్న 115 మందిని కాపాడేందుకు బృందాలను పంపాల్సిందిగా ఎన్డీఆర్​ఎఫ్​, నేవీ, మిలిటరీ, వాయుసేనకు మహా సర్కారు లేఖ రాసింది. లోనావలా లో భారీవర్షాల కారణంగా భుషి జలాశయం నిండిపోగా వరద సంభవించింది.

ఇదీ చూడండి: వరదల్లో చిక్కుకున్న రైలు- 1050 మంది సురక్షితం

Last Updated : Jul 28, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details