భారీ వర్షాలతో మహారాష్ట్ర కుదేలవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. నాసిక్ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గంగాపుర్ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున వరద ప్రమాదకర స్థాయికి చేరింది. భారీ వర్షాలతో నాసిక్ త్రయంబకేశ్వరాలయం నీట మునిగింది. ఆలయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరినందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు నీట మునిగి ముంబయిలో సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.