తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్ష బీభత్సం: పలు రాష్ట్రాలు జలమయం

దేశంలో కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముంబయి లాంటి మహానగరాలు జలదిగ్బంధమయ్యాయి. నాసిక్​లో వరద ఉద్ధృతి కారణంగా ప్రధాన జలాశయాల నుంచి నీటిని విడుదల చేశారు. కేరళలోనూ వరద ముంచెత్తడం వల్ల రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ.

వరద బీభత్సం: పలు రాష్ట్రాలు జలమయం

By

Published : Aug 6, 2019, 7:14 AM IST

Updated : Aug 6, 2019, 7:39 AM IST

వరద ఉద్ధృతికి పలు రాష్ట్రాలు జలమయం

దేశంలో పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వరుణుడి బీభత్సానికి ముంబయి వణికిపోతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

మహారాష్టలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఠాణె, పాల్​ఘర్​,రాయ్​గఢ్​ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాసిక్​, కోల్హాపూర్, సతార జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని, మిగిలిన ప్రాంతాల్లో అంతగా ప్రభావం చూపకపోవచ్చని వెల్లడించింది.

భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీటితో గోదావరి ఉప్పొంగుతోంది. ఫలితంగా.. నాసిక్​లోని ప్రధాన డ్యామ్​లనుంచి నీటిని విడుదల చెయ్యక తప్పట్లేదు. త్రయంబకేశ్వర్​ పరిధిలో గడిచిన 24 గంటల్లో 369 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పుణెలోనూ వరుణుడి ప్రతాపం

పుణెలో వరద బీభత్సానికి స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. భారీ వర్షాల కారణంగా జలాశయాలన్నీ ప్రమాదకర స్థాయిని దాటాయి. వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోని 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కేరళలో రెడ్​ అలర్ట్​

కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముంపు ప్రమాదమున్న ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్​ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 24 గంటల్లోనే 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.

మలప్పురంలో ఇంటిపై చెట్టు విరిగిపడి ఓ మహిళ మృతి చెందింది. చాలా గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. మరికొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:వరుణ బీభత్సం- మహారాష్ట్ర, గుజరాత్​ జలదిగ్బంధం

Last Updated : Aug 6, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details