తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ సహా 18 మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలకు నాలుగు రోజుల ఉపశమనం లభించింది. పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ విచారణను రాజస్థాన్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మరో నాలుగు రోజుల వరకు వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.
స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ పైలట్ సహా 18 ఎమ్మెల్యేలు హైకోర్టును గురువారం ఆశ్రయించారు. దీనిపై ఈరోజు వాదనలు విన్న హైకోర్టు సోమవారం ఉదయం 10 గంటలకు విచారణను వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5.30 వరకు నోటీసులకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పీకర్ తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు.
సమావేశాలు లేనప్పుడు 'విప్' ఎలా?
పార్టీ విప్ ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ తరపున చీఫ్ విప్ మహేష్ జోషి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.