ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్... భారత్‌లో రెండో దశ ప్రయోగ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో ఇద్దరు వలంటీర్లకు బుధవారం ఈ వ్యాక్సిన్ ఇవ్వగా.. వారి ఆరోగ్యం, శరీర పనితీరు చక్కగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఈ 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌ను 32, 48 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులకు మొదటి డోసు వేశారు.
"వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గరి నుంచి మా వైద్య సిబ్బంది వారిని పరిశీలనలో ఉంచారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. నొప్పి, జ్వరం, సైడ్ ఎఫెక్ట్స్, ఇతర అనారోగ్య సూచనలేమీ కనిపించలేదు. వారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఇంటికి పంపివేశాం. వారిని ఎప్పటికప్పుడు మా సిబ్బంది సంప్రదిస్తూనే ఉన్నారు."
- జితేంద్ర ఓస్వాల్, భారతి విద్యాపీఠ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్