కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ అయినప్పటికీ వైరస్ ప్రభావం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యల సమాచారాన్ని కోలుకున్న వారి నుంచి సేకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను ప్రారంభించింది. ఇందుకోసం జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో కలిసి ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకున్న వారికి ఫోన్ చేసి సర్వే జరపాలని భావిస్తోంది. దీని కోసం ఓ ముసాయిదాను కూడా ఏర్పాటు చేసింది.
శ్వాసకోశ సమస్య, గుండె రక్తనాళాలకు సంబంధించిన, నాడీ సమస్యలు, పిల్లలలో రోగనిరోధక శక్తి, ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అని పలు దేశాలు సూచించిన అంశాలను ముందుగా తెలుసుకోనున్నారు. ఈ సమస్యలకు చెందిన డేటాను సేకరించటం కోసం ఐసీఎంఆర్ ఓ రిజిస్టర్ను డెవలప్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..
" ఇంకా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో కరోనా అనంతరం తలెత్తే సమస్యలకు సంబంధించిన డేటాను పర్యవేక్షించడం, సేకరించడం ఎంతో అవసరం. సేకరించిన సమాచారంతో ప్రజల ఆరోగ్యం సమస్యపై అంచనాకు రావొచ్చు." అని ఓ అధికారి తెలిపారు.