కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కరోనా బారిన పడకుండా ఉండేందుకుగాను.. వయో వృద్ధులకు కొన్ని సూచనలు చేసింది.
వృద్ధులు చేయాల్సినవి | చేయకూడనివి |
ఇంటి వద్దనే ఉండండి. సందర్శకులను అనుమతించవద్దు. ఒకవేళ అవసరమైతే ఒక మీటరు దూరంలో ఉండి మాట్లాడండి. | చేతులను శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకవద్దు. |
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ కాగితం, చేతి రుమాలు, లేదా మోచేతిని అడ్డుపెట్టుకోండి. | అనారోగ్యంతో ఉన్నవారి వద్దకు వెళ్లొద్దు. |
ఇంట్లో వాడిన తాజా, వేడివేడి ఆహారాన్నే తీసుకోండి. | సొంతంగా మందులు వాడొద్దు. |
తరచూ నీళ్లు తాగండి. వ్యాధి నిరోధకత పెంపునకు తాజా పండ్ల రసాలు తీసుకోండి. | ఎవరితోనూ కరచాలనం, ఆలింగనం వద్దు. |
వ్యాయామం, ధ్యానం చేయండి. | సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లొద్దు. |
రోజువారీ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోండి. | వీలైనంత వరకూ ఫోన్లోనే వైద్యుల సలహాలు తీసుకోండి |
జ్వరం, దగ్గుతో పాటు శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరల్లోని వైద్యుడిని సంప్రదించండి. | అత్యవసరమైతే తప్పించి ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు. |
కాటరాక్ట్, మోకీలు మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోండి. | - |
వైద్య సిబ్బందికి
కరోనా కేసులు పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బందికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు, సాంకేతిక నిపుణులకు మార్గనిర్దేశం, శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశం.
"కరోనా రోగులకు, లేదా ఈ వైరస్ సోకినట్లు అనుమానమున్న వ్యక్తులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు ఉండాలి. ప్రస్తుతం ఏఎల్ఎస్ (వెంటిలేటర్లతో), బీఎల్సీ (వెంటిలేటర్స్ లేనివి) అనే రెండు రకాల అంబులెన్స్‌లు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వాలు మరిన్ని వాటిని సమకూర్చుకోవచ్చు."