తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులకు ఔషధ లభ్యత పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి చివరి ప్రయత్నంగా ఆమోదం లభించకపోయినా ప్రయోగాత్మక దశలో ఉన్న ఔషధాలను వినియోగించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు 'న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్' (సవరణ) నిబంధనల ముసాయిదాను జూన్ 5 ప్రకటించింది కేంద్రం. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు తెలిపేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ సూచనలకు అనుగుణంగా నిబంధనలను సవరించి తుది నిబంధనలను 'గెజిట్ ఆఫ్ ఇండియా'లో ప్రచురిస్తామని తెలిపింది.
మూడో దశలో ఉన్నవాటినే..
అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్న మందులనే వాడాలని నిర్ణయించింది కేంద్రం. ఆసుపత్రి లేదా వైద్య సంస్థ సూచనలకు అనుగుణంగా ఆమోదం లభించని ఔషధాల తయారీ, దిగుమతికి అవకాశం ఇచ్చింది.
ఏదైనా కొత్త ఔషధాన్ని ఆసుపత్రి సూచిస్తే ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్య(గరిష్ఠంగా 100 డోసులు)లో తయారీకి అనుమతి ఉంటుంది.
అమ్మకాలపై నిషేధం..
కొత్త ఔషధాన్ని వాడేందుకు రోగి లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వకంగా ఆమోదం పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఔషధ తయారీకి ఆసుపత్రి లేదా వైద్య సంస్థ ఎథిక్స్ కమిటీకి దరఖాస్తు సమర్పించి సిఫార్సులను పొందాలి. అనంతరం ఈ సిఫార్సులతో తయారీకి కావాల్సిన అనుమతులను కేంద్రం నుంచి తీసుకోవాలి.
అనుమతుల్లో సూచించిన ప్రకారమే ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుందని ముసాయిదా స్పష్టంగా పేర్కొంది. మరోవ్యక్తికి కానీ, ఏదైనా సంస్థకు లేదా ఇతర ప్రాంతాలకు సరఫరా చేయటం, విక్రయాలు జరపవద్దని తెలిపింది.
కొత్త ఔషధాల తయారీ, దిగుమతులకు సంబంధించి ఈ నిబంధనలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన తయారీదారులు, దిగుమతిదారుల లైసెన్స్‌ను రద్దు లేదా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది.
చాలా ఔషధాలు ఆ దశలోనే..
దేశంలో కరోనా చికిత్సకు సంబంధించి చాలా ఔషధాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. యాంటీ వైరస్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో వినియోగించవచ్చని గతవారం కేంద్రం అనుమతి ఇచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్ సైన్సెస్ తయారుచేసిన ఔషధాన్ని కూడా వినియోగించవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి:దేశంలో 7 వేలు దాటిన కరోనా మరణాలు