కరోనా వైరస్‌పై పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బంది కోసం వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. వైరస్‌పై రోజువారీ ప్రకటనలో భాగంగా పలు కీలక అంశాలను ప్రకటించింది. ఈ మేరకు covidwarriors.gov.in లో వైరస్‌పై పోరుకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండనుంది. కంటెయిన్మెంట్ జోన్లలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న 1.24 కోట్లమంది నిపుణులు, వలంటీర్ల వివరాలు ఈ వెబ్‌పోర్టల్‌లో ఉంటాయి.
రెట్టింపు సమయంలో పెరుగుదల...
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం... కరోనా వ్యాప్తి రెట్టింపయ్యే రేటు పెరిగింది. దేశంలో కరోనా నయమయ్యే కేసు శాతం17.47 గా ఉంది. ఇప్పటివరకు 3,252 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రాపిడ్ కిట్లు వద్దు..
రాపిడ్ కిట్ల ద్వారా కచ్చితమైన ఫలితాలు రావడం లేదని అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కిట్ల విశ్వసనీయతపై విచారణ చేపడుతున్నట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. రెండు రోజుల పాటు రాపిడ్ కిట్లు వినియోగించకూడదని సూచించింది.