గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1020 మంది బాధితులు కోలుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 27.41 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు కరోనా కేసులు, మరణాలపై సరైన సమయంలో, సరైన లెక్కలు సమర్పించలేదని.. అందుకే ఇవాళ ఒక్కసారిగా పెరుగుదల నమోదైందని వివరణ ఇచ్చారు.
మే 7 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రక్రియను వారంరోజుల్లోనే పూర్తిచేయనున్నట్లు స్పష్టం చేసింది.
నిబంధనలు తప్పనిసరి..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవ ఉద్ఘాటించారు. పెళ్లిళ్లకు 50 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 20 మంది కంటే ఎక్కువగా పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థలు.. తమ కార్యాలయాల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని శ్రీవాత్సవ సూచించారు. ఫేస్ మాస్కులు, శానిటైజర్ల లభ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఇంఛార్జ్దేనని తెలిపారు. ఉద్యోగులంతా కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్లో తమ పేర్లు నమోదుచేసుకోవాలని నొక్కిచెప్పారు.