ఈ సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో విద్యా సంస్థల్లోనూ వీటి లభ్యతపై అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందింగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. విద్యాలయాల పరిసరాల్లో ఈ-సిగరెట్లు లభ్యతపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
ఆర్డినెన్స్ నిబంధనలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఈ-హుక్కా వంటి అన్ని రకాల పరికరాలను నిషేధించాలని రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో ఆదేశించారు.
"చూడటానికి అందంగా కనిపించే ఈ-సిగరెట్లు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రమాదకరమైన ఈ-సిగరెట్ల వంటి పరికరాలపై విద్యార్థులు, యువకులకు సరైన అవగాహన కల్పించాలి. ఈ-సిగరెట్ల పొగ ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది. ఇవి సొగసైన ఆకృతితో అందంగా కనిపిస్తాయి. వీటికి యువత ఆకర్షితులయ్యేలా మార్కెటింగ్ చేస్తున్నారు. వీటి వాడకం వల్ల సంప్రదాయ సిగరెట్ల వాడకం వైపు కూడా యువత మొగ్గుచూపుతారు."
-ప్రీతి సుడాన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి