కొవిడ్-19 ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్ వినియోగంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఆయన ఆదివారం 'సండే సంవాద్' ద్వారా మాట్లాడుతూ కొవిడ్ అంశంపై దేశం నలుమూలల నుంచి ప్రజలు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మొదటి ఛాన్స్ వారికే...
తొలినాళ్లలో వ్యాక్సిన్ పరిమిత మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, ఆరోగ్యరీత్యా అధిక ముప్పు ఉన్న వారికి, ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువ ఉన్నవారికి, మరణం ముప్పు పొంచి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో భారత్‌లో విభిన్న రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, అందులో కొన్ని.. నిర్దిష్ట వయసుల వారికి పనికొస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, యువతకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు.
చర్చలు జరుగుతున్నాయ్...
అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై (ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్) ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ప్రజారోగ్య భద్రత, వ్యాక్సిన్ సమర్థతపై నిర్దిష్ట సమాచారం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ టీకాలపై జరుగుతున్న క్లినికల్ ప్రయోగాలు 1, 2, 3 దశల్లో ఉన్నాయన్నారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ఆ డేటా ఆధారంగానే టీకాల అత్యవసర అనుమతిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.