తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరు: ఆ 11 పట్టణాల్లో ప్రత్యేక ఆపరేషన్​! - 11 municipalities

దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం వాటా ఉన్న 11 మున్సిపాలిటీలపై కేంద్రం దృష్టి సారించింది. వైరస్ నియంత్రణకు ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మురికి వాడలు సహా వైరస్ ముప్పు అధికంగా ఉండే ప్రదేశాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది.

11 municipalities in inida account for 70 per cent cases
ఆ మున్సిపాలిటీలపై కేంద్రం నజర్! ప్రత్యేక చర్యలకు ఆదేశం

By

Published : May 24, 2020, 2:24 PM IST

రానున్న రెండు నెలల పాటు కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. మొత్తం కేసుల్లో 70 శాతం వాటా కలిగిన 11 మున్సిపాలిటీలకు ఈ మేరకు సూచనలు జారీ చేసింది. పాత నగరాలు, మురికివాడలు, వలస కార్మికులు ఉండే ప్రాంతాలు సహా వైరస్ వ్యాప్తి అధికమయ్యే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, దిల్లీ, మధ్య ప్రదేశ్​, పశ్చిమ్ బంగ, రాజస్థాన్​లోని 11 మున్సిపాలిటీల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వైద్య శాఖ వెల్లడించింది.

ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన వైద్య కార్యదర్శులు, 11 పట్టణాల మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ ముప్పు అధికంగా ఉండే ప్రదేశాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

"తక్కువ రెట్టింపు​ సమయం, అధిక మరణాల రేటు, అధిక నిర్ధరణ కేసుల రేటు జాతీయ స్థాయి కన్నా ఎక్కువగా ఉన్న పట్టణాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతాల్లో వైరస్​ను నియంత్రించడం అతి పెద్ద సవాల్​గా మారుతోంది."

-కేంద్ర వైద్య శాఖ

కంటైన్​మెంట్, బఫర్ జోన్లను నిర్ణయించడానికి పరిగణించాల్సిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంటైన్​మెంట్ జోన్లలో చేపట్టాల్సిన చర్యలను వివరించినట్లు తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి పర్యవేక్షణ వంటివి నిర్వహించాలని స్పష్టం చేసింది.

వేగం పెంచండి

బఫర్​ జోన్లలో వైరస్​ లక్షణాలు, ఇన్​ఫ్లుయెంజా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించాలని అధికారులకు వైద్య శాఖ సూచించింది. వ్యక్తిగత దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేసులను త్వరగా గుర్తించేందుకు పరీక్షల సంఖ్య, వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది. ఐసొలేషన్ బెడ్​లు, ఐసీయూలు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. రెండు నెలల వరకు వైరస్​పై పోరాడే విధంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

సేవలపై అవగాహన కల్పించండి

నమూనాల సేకరణలో జాప్యం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్​లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు వైద్య శాఖ సూచించింది. పాజిటివ్ కేసుల వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, వైద్య సిబ్బందిని దూరం పెట్టడం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వారి సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్​ రూంలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించింది.

ఇదీ చదవండి:'ఇదంతా తబ్లీగీల వల్లే... వారి నేరాలకు శిక్ష తప్పదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details