ప్రేమ.. వయస్సు, వర్గం, తారతమ్యాలు లేకుండా కలిగే ఒక అందమైన అనుభూతి. సినిమాల్లో చూపించినట్టు అందరు ప్రేమికులు అందంగా ఉండలేకపోవచ్చు. కానీ ప్రేమకు అందమైన మనసైతే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. అలాంటి కథల్లో ఇది ఒకటి.
ఒకరు కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ సహచరుడయితే.. మరొకరు అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఓ వ్యక్తిని హత్య చేసిన మహిళ. వారిని కలిపింది ఏ పార్కో.. హోటలో కాదు.. అక్షరాలా జైలు గోడల మధ్య చిగురించింది వారి ప్రేమ.
అతడి పేరు అన్బురాజ్.. పోలీస్ కావాలని కలకన్నాడు. అనుకోకుండా వీరప్పన్ దళంలో చేరాల్సి వచ్చింది. కరడుగట్టిన ఆ నేరస్థుడితో కలసి పలు నేరాలు చేశాడు. పోలీసులకు చిక్కి 17 ఏళ్లపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అక్కడే పరిచయమయింది రేవతి. చెన్నైకి చెందిన ఓ అనాథ ఆమె. 14 ఏళ్ల వయస్సులో పనికోసం బెంగళూరుకు వెళ్లింది. ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆమెపై కన్నేసిన ఓదుర్మార్గుడు ఆమెను అమ్మాయిల విక్రయ ముఠాకు అమ్మేయాలని చూశాడు. ఈ సంగతి తెలిసిన రేవతి అతడిని ఎదిరించి కత్తితో పొడిచి చంపేసింది. ఫలితంగా 13 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు.