జనతాదళ్(సెక్యులర్) అధినేత, భారత మాజీ ప్రధాని హెజ్ డీ దేవెగౌడ కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. నామినేషన్‌ను మంగళవారం దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ దేవెగౌడ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"పార్టీ నాయకులు, సోనియా గాంధీ, ఇతర జాతీయ నేతల వినతి మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని దేవెగౌడ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారు. మా అందరి విజ్ఞప్తిని అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు."
-హెచ్డీ కుమార స్వామి ట్వీట్.
ప్రజానేత దేవెగౌడ ఎన్నో జయాపజయాలను చూశారని, ఉన్నత స్థానాలకు చేరుకున్నారని కుమార స్వామి అన్నారు. ఆయనను రాజ్యసభలోకి అడుగుపెట్టాలని ఒప్పించడం అంత తేలికైన విషయం కాదని, చివరకు అందరి కోరిక మేరకు అంగీకరించారని చెప్పారు. రాజ్యసభలో కర్ణాటక రాష్ట్ర ఉన్నత ప్రతినిధిగా ఉంటారని చెప్పారు.
జేడీఎస్‌కు కర్ణాటకలో ప్రస్తుతం 38 స్థానాలే ఉన్నాయి. దేవెగౌడ ఎన్నికకు మరో 16 స్థానాలు అవసరం. కాంగ్రెస్‌కు కర్ణాటకలో 68 స్థానాల సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో మిగులు ఓట్లను జేడీఎస్‌కు సర్దుబాటు చేయాలని సోనియాగాంధీ నిర్ణయించినట్లు సమాచారం.